ఓటీటీలోకి రాబోతున్న ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?!
బాలనటిగా మెప్పించి, ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యుఫోరియా'.
By: Madhu Reddy | 31 March 2026 1:00 AM ISTబాలనటిగా మెప్పించి, ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యుఫోరియా'. యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యువతను ఆలోచింపజేసే అంశాలతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలు చూద్దాం..
యదార్థ సంఘటనల ఆధారంగా కథ తీసుకోవటం:
ఇక సారా అర్జున్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించిన 'యుఫోరియా' చిత్రం సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణమైన వాస్తవాల చుట్టూ తిరుగుతుంది. చైత్ర (సారా అర్జున్) అనే ఒక తెలివైన అమ్మాయి, సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవం ఈ కథకు ప్రధాన ఆధారం. స్నేహం పేరుతో దగ్గరై, డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు ఆమెపై చేసిన అఘాయిత్యం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక ఆ తర్వాత ఆ బాధితురాలు న్యాయం కోసం ఎలా పోరాడింది అనేది దర్శకుడు చాలా హృద్యంగా చూపించారు.
ఆకట్టుకునే పాత్రలు.. అదిరిపోయే ట్విస్టులు:
ఈ సినిమాలో భూమిక చావ్లా, నాజర్, గౌతమ్ మీనన్ వంటి సీనియర్ నటులు తమ నటనతో ప్రాణం పోశారు. ముఖ్యంగా సిటీ కమిషనర్ జయదేవ్ పాత్రలో గౌతమ్ మీనన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రేప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? 'ఆపరేషన్ యుఫోరియా' వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే అంశాలు ప్రేక్షకుల్లో కుతూహలాన్ని కలిగిస్తాయి. ప్రతి సన్నివేశం తర్వాతి నిమిషం ఏం జరుగుతుందో అన్నంత ఉత్కంఠగా సాగుతుంది.
థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి:
ఈ ఏడాది ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు అందించింది.ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ గురించి, అలాగే భూమిక నటన గురించి గొప్పగా చెప్పుకున్నారు. చందు మొండేటి కథ అందించిన ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఫ్రెండ్‌షిప్, లవ్, బ్రేకప్ అనే ముసుగులో యువత ఎలా దారి తప్పుతున్నారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్:
ప్రస్తుతం సారా అర్జున్ 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో, ఆమె నటించిన ఈ 'యుఫోరియా'పై అంచనాలు పెరిగాయి. 'ఈటీవీ విన్' సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ ఇంటెన్స్ క్రైమ్ డ్రామాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. యువతతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇది. మరెందుకు ఆలస్యం, ఆ తేదీని నోట్ చేసి పెట్టుకోండి.
