Begin typing your search above and press return to search.

డార్లింగ్ తో మెగాస్టార్.. ఇక రికార్డులు షురూ..!

మెగాస్టార్ చిరంజీవి నిర్వహించనున్న ‘మెగావర్స్’ టాక్ షోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ డేట్స్ కోసం షో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా డేట్స్ ఖరారయ్యే అవకాశం ఉందని టాక్.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Nov 2026 9:35 AM IST
డార్లింగ్ తో మెగాస్టార్.. ఇక రికార్డులు షురూ..!
X

ప్రభాస్ చాలా అరుదుగా ఇంటర్వ్యూలకు వస్తూ ఉంటారు. కానీ ఆయన వస్తే మాత్రం ఆ ఇంటర్వ్యూ.. ఆయనలానే చాలా స్వీట్ గా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపైకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. మెగావర్స్ పేరుతో ఆయన ఒక ప్రత్యేకమైన టాక్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకోరానన్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, దర్శకులు ఈ షోలో సందడి చేయబోతున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఒక ప్రత్యేక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట.

ప్రభాస్ సాధారణంగా సినిమా ప్రమోషన్లకు, ఇంటర్వ్యూలకు చాలా అరుదుగా హాజరవుతుంటారు. ఆయన బయట కనిపించడం కూడా అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అలాంటిది ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే అందులో తనదైన సరదా మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అందుకే చిరంజీవితో కలిసి ప్రభాస్ ఒకే వేదికపై కనిపిస్తే ఆ ఎపిసోడ్ ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగావర్స్ నిర్వాహకులు ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ రూపొందించాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఆయన డేట్స్‌ను సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి చిత్రం 'ఫౌజీ' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనుల మధ్య ఆయనకు అనుకూలమైన తేదీల కోసం షో టీమ్ ఎదురుచూస్తోందని ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రభాస్ డేట్స్ ఖరారైతే ఎపిసోడ్ షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించే అవకాశం ఉందని టాక్. ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమంతో టాక్ షోలకు కొత్త క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు చిరంజీవి కూడా తనదైన శైలిలో మెగావర్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మెగా అభిమానులనే కాకుండా ఇతర హీరోల అభిమానులను కూడా ఆకట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ నిజమైతే మెగావర్స్‌కు మరింత క్రేజ్ రావడం.. ఈ ఎపిసోడ్ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించడం.. ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.