Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: ఓటీటీల టీటీల‌కు చెక్ పెట్టేదెప్పుడు?

ఇటీవలి కాలంలో సామాన్యుడు థియేటర్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సినిమా టికెట్ ధరల మోత ఒకెత్తయితే థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ (కోలా) బిల్లులు అంతకుమించి ఉంటున్నాయి.

By:  Sivaji Kontham   |   17 May 2026 1:00 AM IST
ట్రెండీ టాక్: ఓటీటీల టీటీల‌కు చెక్ పెట్టేదెప్పుడు?
X

ఇటీవలి కాలంలో సామాన్యుడు థియేటర్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సినిమా టికెట్ ధరల మోత ఒకెత్తయితే థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ (కోలా) బిల్లులు అంతకుమించి ఉంటున్నాయి. చాలా కుటుంబాలు టికెట్ ధరల కంటే ఈ కార్న్-కోలాల బిల్లులు భరించలేకే థియేటర్లకు వెళ్లడం తగ్గించేశామని బహిరంగంగానే చెబుతున్నాయి. అయితే థియేటర్ల ఖర్చులు భారీగా పెరగడాన్ని అదనుగా తీసుకున్న ఓటీటీ లు.. గత కొంతకాలంగా తమ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచడంలో విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కరోనా సంక్షోభ కాలంలో ఇంటికే పరిమితమై ఓటీటీలకు అలవాటు పడిన ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించేయడంతో అటు సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ అసలు నిజం ఏమిటంటే.. థియేటర్ల కంటే ఈ ఓటీటీలే ఇప్పుడు సగటు వినోద ప్రియుడి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ల కోసమే ఏడాదికి దాదాపు రూ. 15,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి తోడు ఈ కంటెంట్‌ను హై-స్పీడ్‌తో వీక్షించడానికి అవసరమైన ఇంటర్నెట్ (వైఫై) బిల్లుల కోసం ఏడాదికి సులువుగా మరో రూ. 20,000 వరకు ఖర్చవుతోంది. అంటే ఓవరాల్‌గా కేవలం డిజిటల్ వినోదం కోసమే ఒక సామాన్యుడు ఏడాదికి రూ. 35,000 పైగా ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. బడ్జెట్ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఆర్థిక భారమనే చెప్పాలి.

సినిమాలు, వెబ్ సిరీస్‌ల అన్ని సీజన్లను విడిచిపెట్టకుండా చూడాలంటే ఏడాది పొడవునా కచ్చితంగా ఈ సబ్‌స్క్రిప్షన్లు ఉండాల్సిందే. ఒకసారి వీటికి అలవాటు పడిన తర్వాత మధ్యలో వదిలేయడం వినియోగదారులకు అస్సలు కుదరడం లేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సరికొత్త షోలను ఎక్కడ మిస్ అవుతామో అనే ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఒకప్పుడు కేబుల్ టీవీ కాలంలో ఆపరేటర్‌కు నెలకు కేవలం రూ. 300 చెల్లిస్తే చాలు.. ఇంట్లోని వారందరికీ కావలసిన వందలాది ఛానళ్లు, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు ఒకే చోట లభించేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా, నచ్చిన కంటెంట్ కోసం వేర్వేరు యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని, ప్రతి దానికి విడివిడిగా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. వినోదం ఇలా ముక్కలైపోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతోంది.

ఓటీటీల పేరుతో డిజిటల్ యాప్‌లకు ఏటా వేలకు వేలు తగలేసే కంటే.. ఆ డబ్బుతో ఏడాది పొడవునా చక్కగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి, నచ్చిన స్నాక్స్ తింటూ సినిమా చూడటమే ఎంతో మేలనే విషయం ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు అర్థమవుతోంది. కేవలం ఒక మొబైల్ స్క్రీన్ ముందో ఇంట్లోని టీవీ ముందో ఒంటరిగా కూర్చుని చూసే ఓటీటీల కంటే.. వందలాది మంది మధ్య పెద్ద స్క్రీన్‌పై చూసే థియేటర్ అనుభవమే అసలైన `పైసా వసూల్` వినోదాన్ని ఇస్తుంది. మనం చెల్లించే పైసాకు తగ్గ పూర్తి తృప్తి.. ఒక మధురమైన అనుభూతి కేవలం థియేటర్లలోనే దొరుకుతాయి కానీ ఓటీటీలలో కాదనే సత్యం నెమ్మదిగా వెలుగులోకి వస్తోంది.

మొత్తానికి ఒకప్పుడు చౌకైన ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన ఓటీటీలు.. నేడు బుల్లితెర వినోదాన్ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశాయి. మునుముందు రోజుల్లో ఇవి మరింత ఇష్టానుసారంగా ఫీజులను పెంచి, వినియోగదారులను మరింతగా బాధించే రోజులు ముందున్నాయి. సాంప్రదాయ వినోద పద్ధతుల నుండి విముక్తి కలిగిస్తాయనుకున్న ఈ డిజిటల్ వేదికలు.. ఇప్పుడు జేబులకు చిల్లులు పెడుతూ కొత్త తరహా బానిసత్వానికి దారితీస్తున్నాయి. అందువల్ల ప్రతి నెలా మనం దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో.. ఆయా సబ్‌స్క్రిప్షన్లు మనకు ఎంతవరకు అవసరమో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.