క్లాప్ కొట్టక ముందే ఓటీటీ ఫిక్స్...!
సినిమాలు ఒకప్పుడు థియేటర్‌లలో నెలల తరబడి ఆడేవి. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలు థియేటర్‌లలో ఉండటం లేదు.
By: Ramesh Palla | 28 Nov 2025 3:00 PM ISTసినిమాలు ఒకప్పుడు థియేటర్‌లలో నెలల తరబడి ఆడేవి. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలు థియేటర్‌లలో ఉండటం లేదు. ఒక సినిమా నాలుగు వారాలు థియేటర్‌లో ఉంది అంటే అదో గొప్ప అద్భుతమైన సినిమాగా చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఏడాది పొడవున థియేటర్‌లో ఆడిన సినిమాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఓటీటీ. అప్పట్లో సినిమాను చూడాలి అంటే థియేటర్‌లో చూడాలి లేదంటే చాలా నెలల తర్వాత టీవీలో వస్తే చూడాలి. అంతే కాని ఓటీటీలు లేవు. కానీ ఇప్పుడు ఓటీటీలు మూడు నాలుగు వారాల్లోనే సినిమాను తీసుకు వస్తున్నాయి. థియేటర్‌లో విడుదల అయిన వెంటనే ఏ ఓటీటీలో సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఓటీటీ మార్కెట్ పెరిగిన కారణంగా సినిమాల బడ్జెట్, హీరోల పారితోషికం పెంచుతున్నామని నిర్మాతలు చెబుతున్న విషయం తెల్సిందే.
ఓటీటీ మార్కెట్ అనుసారంగా..
ఓటీటీలు అనేవి సినిమా ఇండస్ట్రీని పూర్తిగా మార్చేసింది. కొత్త వారికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న ఓటీటీలు థియేటర్‌లను నాశనం చేస్తున్నాయి అనేది సగటు సినీ ప్రేమికుడి ఆవేదన. నిర్మాతలు సైతం ఆ విషయంతో అంగీకరిస్తున్నప్పటికీ చాలా మంది నిర్మాతలు ఓటీటీల వెంట పరుగెడుతున్నారు. సినిమా ప్రారంభంకు ముందే ఓటీటీ వారితో చర్చలు మొదలు పెడుతున్నారు. ఒకప్పుడు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల తర్వాత ఓటీటీలకు సినిమాను అమ్మడం మనం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు కథ చెప్పి, హీరో, దర్శకుడు, హీరోయిన్ ఎవరు అనే విషయాలను చెప్పి ఓటీటీల వద్ద నిర్మాతలు డీల్ కుదుర్చుకుంటున్నారు. కనీసం ఒక్క సీన్ షూట్ కాకుండానే, కనీసం క్లాప్ కొట్టకుండానే ఓటీటీ డీల్స్ పూర్తి అవ్వడం అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న కొత్త ట్రెండ్ అనేది చెప్పక తప్పదు.
టాలీవుడ్ సినిమాలు..
అన్ని భాషల సినిమా ఇండస్ట్రీ వారు ఓటీటీ మార్కెట్ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. థియేటర్‌కు జనాలు రావడం తగ్గారని ఆ మధ్య సినిమాను నాలుగు వారాల్లో కాకుండా కనీసం ఏడు లేదా ఎనిమిది వారాల పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు, అంతే కాకుండా సినిమా టైటిల్ కార్డ్ ల్లో ఓటీటీ భాగస్వామి పేరు వేయకూడదని కూడా నిర్మాతల మండలి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అది కొన్ని సినిమాలకు కూడా అమలు కాలేదు. ప్రతి సినిమా నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతే కాకుండా సినిమా నిర్మాణ దశలోనే, కొన్ని సినిమాలకు షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ పాట్నర్ ఫిక్స్ అవుతున్నారు. దాంతో టైటిల్ కార్డ్‌లో వేయడంతో పాటు, పోస్టర్స్‌లోనూ వేస్తున్నారు. దాంతో సదరు ఓటీటీలో చూడటం కోసం ప్రేక్షకులు విడుదల రోజు నుంచే కాసుకు కూర్చుంటున్నారు.
థియేటర్ రిలీజ్ మూవీస్
థియేటర్లకు వెళ్లలేని సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు ఓటీటీ పై ఎక్కువగా ఆధార పడుతున్నారు. అందుకే ఓటీటీ బిజినెస్ ఎక్కువగా పెరిగింది. సినిమాల బడ్జెట్‌ను శాశించగల స్థాయికి ఓటీటీలు వెళ్లాయి. సినిమా ప్రారంభం సమయంలోనే ఓటీటీలతో డీల్ కుదిరితే ఆ సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కామన్‌గా జరుగుతుంది. ఇక హీరోల పారితోషికం, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సైతం ఓటీటీ డీల్ ను బట్టి జరిగి పోతున్నాయి. దాంతో సినిమా కథ రెడీ అయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఓటీటీ సంస్థలను నిర్మాతలు సంప్రదించడం జరుగుతోంది. ఇక కొందరు ఓటీటీ నిర్వాహకులు ఏకంగా నిర్మాతల వద్దకు వెళ్లి తమ ఓటీటీ కోసం సినిమా నిర్మించాలని అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. అది కొత్త ట్రెండ్‌గా ఉంది. ఇలా ఓటీటీలు ఇండస్ట్రీని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. విడుదల తేదీలు మొదలుకుని ప్రతి విషయంలోనూ ఓటీటీల ప్రమేయం ఎక్కువ అయ్యింది. ఇది ఎంత మాత్రం ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు అనేది విశ్లేషకుల మాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన ఎక్కువ అవుతుంది.
