Begin typing your search above and press return to search.

అస‌లు సెన్సార్ అనేది పెద్ద దండ‌గ అని వాదిస్తుంటే..!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెన్సార్‌షిప్ అనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని.. అది సృజనాత్మకతను చంపేస్తోందని ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   17 July 2026 12:08 PM IST
అస‌లు సెన్సార్ అనేది పెద్ద దండ‌గ అని వాదిస్తుంటే..!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెన్సార్‌షిప్ అనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని.. అది సృజనాత్మకతను చంపేస్తోందని ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి సినీ దిగ్గజాలు ఈ సెన్సార్‌షిప్ విధానంపై నిరంతరం విరుచుకుప‌డుతున్నారు. అసలు ఒకరి క్రియేటివిటీపై, కనీస సృజనాత్మకత లేని సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ అధికారం లేదా అవగాహనతో కత్తెర వేస్తారని వారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. కథల వైవిధ్యాన్ని, ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా స్వేచ్ఛను అడ్డుకునే ఈ పాతకాలపు పద్ధతి పెద్ద దండగ అంటూ వారు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.

సినీ మేధావులు ఒకవైపు సెన్సార్‌షిప్‌ను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంటే... ప్రభుత్వం మాత్రం డిజిటల్ వినోద రంగంపై కూడా తన నియంత్రణను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో నేరుగా విడుదలయ్యే అన్ని సినిమాలు కూడా ఇకపై సినిమాహాళ్లలో విడుదలయ్యే చిత్రాల మాదిరిగానే స్ట్రీమింగ్ కావడానికి ముందే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ధృవీకరణను పొందాలని కేంద్రం కొత్త రూల్స్ అన్వేషిస్తోంది. సృజనాత్మకత పేరుతో ఓటీటీలలో మితిమీరిన కంటెంట్ వస్తోందనే భావనతో.. క్రియేటర్లపై మరింత ఉక్కుపాదం మోపేలా ఐటీ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనల వైపు వేగంగా అడుగులు వేయడానికి ఇటీవల ఓటీటీలలో ఎదురైన‌ కొన్ని పరిణామాలు కారణమవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోని..తీవ్ర వివాదాస్పదమైన దిల్జీత్ దోసాంజ్ చిత్రం `షట్లజ్` ను ఇటీవల ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నేరుగా విడుదల చేసింది. సెన్సార్ బోర్డ్‌తో ఎలాంటి సంబంధం లేకుండా.. ఏ విధమైన కత్తెర పడకుండా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడంతో సీబీఎఫ్‌సీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ధిక్కరించి వివాదాస్పద కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీబీఎఫ్‌సీ భావిస్తుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ కొత్త రూల్స్ గనుక అమల్లోకి వస్తే... ఫిల్మ్ మేకర్స్ తమ చిత్రాలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ చేయడానికి ముందే క‌చ్చితంగా సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఓటీటీలు అనుభవిస్తున్న`డైరెక్ట్-టు-ఓటీటీ` రిలీజ్ స్వేచ్ఛ పూర్తిగా అంతమైపోతుంది. కథ డిమాండ్ చేసినా బోల్డ్ కంటెంట్, రాజకీయ లేదా సామాజికంగా సున్నితమైన అంశాలను చూపించాలంటే దర్శకులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. థియేటర్ సినిమాల తరహాలోనే ఇక్కడ కూడా సెన్సార్ కత్తెర పడటం వల్ల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రత్యేకత, వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. మేధావుల వైపు నుంచి చూస్తే.. వయస్సు వర్గీకరణ, పేరెంటల్ లాక్స్ ఉన్నప్పుడు వీక్షకుడికి నచ్చిన కంటెంట్ చూసే స్వేచ్ఛ ఉండాలని... సెన్సార్‌షిప్ అనేది ప్రజాస్వామ్య విరుద్ధమని వాదిస్తున్నారు. మరోవైపు సమాజంలో శాంతిభద్రతలు, నైతిక విలువలను కాపాడటానికి, మతపరమైన ఉద్రిక్తతలు రాకుండా ఉండటానికి నియంత్రణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండింటిలో కేవలం ఒకరి స్వేచ్ఛ కోసమే మొగ్గు చూపడం లేదా పూర్తి ఉక్కుపాదం మోపడం కాకుండా.. సృజనాత్మకతను గౌరవిస్తూనే బాధ్యతాయుతమైన స్వీయ-నియంత్రణ పద్ధతులను బలోపేతం చేయడమే సరైన మార్గం అవుతుంద‌ని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రియేటివిటీ ఎప్పుడూ ఒక‌రి నియంత్ర‌ణ‌లో ఉండ‌కూడ‌దు. అదే స‌మ‌యంలో అది హ‌ద్దుమీరిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావివ్వ‌కూడ‌దు. దీనిని బ్యాలెన్స్ చేయ‌డం ద‌ర్శ‌కనిర్మాత‌ల కోణంలో అది చాలా పెద్ద బాధ్య‌త‌.