OTTల డబుల్ గేమ్.. ఇదంతా లాక్ డౌన్ తెచ్చిన ముప్పు!
అయితే ఈ పరిస్థితిని ఏ కోణంలో చూడాలి? దీనిని ఎలా విశ్లేషించాలి? అంటే దీనికి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఇచ్చిన వివరణ ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.
By: Sivaji Kontham | 1 Dec 2025 9:58 AM ISTఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు దుర్ధశ పట్టుకుందని, ఓటీటీ- శాటిలైట్ రైట్స్, ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ లో హవా తగ్గిపోయిందని నిర్మాతలలో ఆవేదన వ్యక్తమవుతోంది. 2024 ఎండింగ్ నుంచి ఈ దశ ఇలానే కొనసాగుతోంది. 2025 ముగింపులో ఉన్నాం. 2026లోను ఈ పరిస్థితి కొనసాగితే మనుగడ సాగించడం ఎలా? అంటూ చాలా మంది నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఓటీటీ హక్కులు - నాన్ థియేట్రికల్ మార్కెట్ అమాంతం పెరిగిపోయిందని చంకలు గుద్దుకున్న చాలా మంది నిర్మాతలకు ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాలలో ఎవరికి వారు విశ్లేషణలు సాగిస్తున్నారు.
ఇటీవలి కాలంలో శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసేవాళ్లే కరువయ్యారు. ఓటీటీ కంపెనీలు ధరలు తగ్గించి గేమ్ ఆడుతున్నాయి. అసలు కొన్ని సినిమాలను కొనేందుకు కూడా ఓటీటీలు ఆసక్తిగా లేవు. థియేటర్లలో కమర్షియల్ గా ఎంత బాగా ఆడింది? అనేదానిని బట్టి ధరలు నిర్ణయించేలా నిర్మాతలతో ఓటీటీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని కూడా కథనాలు వచ్చాయి.
అయితే ఈ పరిస్థితిని ఏ కోణంలో చూడాలి? దీనిని ఎలా విశ్లేషించాలి? అంటే దీనికి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఇచ్చిన వివరణ ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. నిజానికి ఈ ముప్పు అంతా లాక్ డౌన్ తోనే వచ్చింది. ఆ సమయంలో జనం ఇళ్లలో కూచున్నారు. ఓటీటీలకు అలవాటు పడ్డారు. పదుల సంఖ్యలో ఎపిసోడ్లను చూడటానికి అప్పట్లో సమయం ఉండేది. దీంతో ఓటీటీలు తాము తయారు చేసిన ఒరిజినల్ కంటెంట్ సరిపోకపోవడంతో ఇతరుల కంటెంట్ ని కొన్నాయి. దానికోసం భారీ మొత్తాలను చెల్లించాయి. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తెలుగు సినిమాలకు ఓటీటీ మార్కెట్ అమాంతం పెరిగిపోయిందని అందరూ భావించారు.
ఇక్కడ కూడా డిమాండ్ సప్లయ్ సూత్రాన్ని పరిశీలించాలి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమై ఓటీటీలను ఆదరించారు. పదుల సంఖ్యలో ఎపిసోడ్లను గంటల తరబడి చూడటానికి అప్పుడు సమయం ఉంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఓటీటీ కంటెంట్ తో పాటు ఇతర ఆప్షన్లు ప్రజలకు ఉన్నాయి. చూడటానికే సమయం సరిపోవడం లేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత జనం వారి పనులతో బిజీ అయ్యారు. అలాగే సినిమాల నిర్మాణం పెరిగింది. అందువల్ల ఓటీటీలకు ప్రత్యామ్నాయ కంటెంట్ ఇతరుల వద్ద చాలా ఉంది. అందువల్ల ఓటీటీల వీక్షణ తగ్గింది. దాని పర్యవసానం, ఇప్పుడు వారు కూడా ధరలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. లాక్ డౌన్ లో సినిమాలు, షోలు చూసినట్టు ఇప్పుడు చూడలేము కదా? పైగా కమర్షియల్ సినిమాలను జనం ఎక్కువ ఆదరిస్తారు. ఓటీటీలు సబ్ స్క్రిప్షన్లు పెంచుకోవాలంటే సినిమాలను విధిగా కొనాలి. కానీ వారికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఏడాదికి ఎన్ని సినిమాలు కొనాలో లెక్క ఉంటుంది. దాని ప్రకారమే ఓటీటీలు ఇతరుల నుంచి కంటెంట్ ని కొంటున్నాయి.
అయితే ధరల తగ్గుదల ఎందుకు? అంటే ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఆదరణ, డిమాండుకు తగ్గట్టే ధర పెరుగుతుంది. అయితే కంటెంట్ కి ఒక స్థిరీకరించిన రేటు ఉంటుందని నిర్మాతలు తెలుసుకోవాలి. లాక్ డౌన్ సమయంలో పెంచిన రేటు వాస్తవ ధర కాదు.. ఇప్పుడు స్థిరీకరించిన రేటు మాత్రమే ఉంటుంది. దానికి తగ్గట్టే నిర్మాత సినిమాలకు బడ్జెట్లు కేటాయించాలని కూడా విశ్లేషించారు రామ్ ఆచంట, గోపి ఆచంట. డిసెంబర్ 5న విడుదల అవుతున్న అఖండ 2 ఇండియా లెవల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాను కనబరిచిన ఈ నిర్మాతలు తమ సుదీర్ఘ అనుభవంతో ఓటీటీ మార్కెట్‌ను విశ్లేషించడం విజ్ఞానదాయకం.
