నెట్ ఫ్లిక్స్ తొలగించిన టాప్ 10 సినిమాలు ఇవే
డిజిటల్ ఒప్పందాల కాలపరిమితి తీరడంతో ఇటీవల కాలంలో దక్షిణాది - బాలీవుడ్‌కు చెందిన పలు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా నుండి వైదొలిగాయి.
By: Sivaji Kontham | 28 Aug 2026 10:55 AM ISTప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ లైసెన్సింగ్ ఒప్పందాల గడువు ముగియడం వల్ల కొన్ని సినిమాలు క్యాటలాగ్ నుంచి నిష్క్రమిస్తుంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున నటించిన రోమాంటిక్ కామెడీ చిత్రం 'మన్మథుడు 2' త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి వైదొలగనుంది. 22 సెప్టెంబర్ 2026 నాటికి ఈ సినిమా స్ట్రీమింగ్ ముగియనుండటంతో ఇప్పటివరకు చూడని వీక్షకులకు డిజిటల్‌లో చూసేందుకు ఇది చివరి అవకాశంగా మారింది.
ఆగస్టు 29న రాబోతున్న నాగార్జున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మైలురాయి చిత్రం అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠ నడుమ 'మన్మథుడు 2' నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలిగిపోనుండటం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించగా, సమంత రూత్ ప్రభు, కీర్తి సురేష్ ప్రత్యేక కామియో పాత్రల్లో అలరించారు.
కేవలం నాగార్జున 'మన్మథుడు 2'మాత్రమే కాకుండా.. డిజిటల్ ఒప్పందాల కాలపరిమితి తీరడంతో ఇటీవల కాలంలో దక్షిణాది - బాలీవుడ్‌కు చెందిన పలు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా నుండి వైదొలిగాయి. తెలుగులో కళ్యాణ్ దేవ్ నటించిన `సూపర్ మచ్చా`తో పాటు యష్ నటించిన పాన్-ఇండియా చిత్రం `కెజిఎఫ్: చాప్టర్ 1` (డబ్బింగ్ వర్షన్లు) డిజిటల్ ఒప్పందాలు ముగియడంతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో లేకుండా పోయాయి.
తమిళం - బహుభాషా చిత్రాల విషయానికి వస్తే.. తాప్సీ పన్ను నటించిన వైవిధ్యమైన సైకోలాజికల్ థ్రిల్లర్ `గేమ్ ఓవర్` (తెలుగు, తమిళం, హిందీ) .. ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్ నటించిన డ్యాన్స్ ఆధారిత చిత్రం `లక్ష్మి` స్ట్రీమింగ్ హక్కులు ముగియడంతో వైదొలిగాయి. అలాగే మణిరత్నం నిర్మాణంలో వచ్చిన ప్రసిద్ధ అంథాలజీ `నవరస`లోని కొన్ని భాగాల గ్లోబల్ లైసెన్సింగ్ డిజిటల్ హక్కుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
హిందీ చిత్రసీమలో కూడా విమర్శకుల ప్రశంసలు పొందిన ఆయుష్మాన్ ఖురానా `ఆర్టికల్ 15`, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన `అంధాధున్`, రియా చక్రవర్తి `జలేబీ`... ప్రాంతీయ డ్రామా `డంగ్` వంటి టాప్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ నుంచి అదృశ్యమయ్యాయి. ఓటీటీ ప్రియులు తమకు ఇష్టమైన ఈ చిత్రాలను మళ్లీ వీక్షించాలనుకుంటే వేరే డిజిటల్ వేదికలపైకి మారే వరకు వేచి చూడాల్సిందే.
