టైటిల్ మార్చినా తప్పని నిరాశ!
బాలీవుడ్ లో మనోజ్ బాజ్ పాయ్ జర్నీ ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 25 Oct 2026 8:31 PM ISTబాలీవుడ్ లో మనోజ్ బాజ్ పాయ్ జర్నీ ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్‌తో అతడి కెరీర్ కొత్త టర్నింగే తీసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓటీటీని ఏలుతోన్న స్పెషల్ స్టార్ గా చెప్పొచ్చు. తాజాగా మనోజ్ నటించిన చిత్రం `గజబ్ రాత్`. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ చేసిన చిత్రం రిలీజ్‌కు ముందే వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా ప్రయాణం తొలి నుంచీ వివాదాస్పదంగానే సాగింది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రానికి `ఘుస్కొర్ పండిత్` అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. ఆ పేరు ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వివాదంపై చిత్ర యూనిట్ పునరాలోచించి టైటిల్‌ను `గజబ్ రాత్` గా మార్చింది. ఈ టైటిల్ మార్పు వ్యవహారమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసి సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఓసారి కథ లోకి వెళ్తే.. అజయ్ నిర్విత్ (మనోజ్ బాజ్ పాయ్) ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్. వృత్తిపరంగా నైతికత లేకపోవడంతో పాటు అమ్మాయిల పిచ్చి కూడా ఉన్న పాత్ర అతనిది. ఒక రాత్రి దారుణమైన గాయాలతో కారులో నుంచి విసిరేయబడిన ఓ యువతి కేసు అతనికి దర్యాప్తు నిమిత్తం వస్తుంది. ఆ కేసుకు సంబంధించి లోతుగా వెళ్లేకొద్దీ ఈ ఘటన వెనుక భారీ వ్యాపార, రాజకీయ శక్తులు ఉన్నట్లు సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. మొదట ఆ కేసును అడ్డుపెట్టి డబ్బు సంపాదించాలనుకున్న ఆ పోలీసు అధికారి అటుపై మనసు మార్చుకుని అసలు దోషులను ఎలా పట్టుకున్నాడు అనేదే కథ.
ప్లాట్ వినగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా `టెంపర్` గుర్తుకొస్తుంది. ప్రధాన కథాంశం పరంగా పోలికలు స్పష్టంగా ఉన్నా? దర్శకుడు నీరజ్ పాండే .. రచయిత రితేష్ షా దీనికి భిన్నమైన ట్రీట్‌మెంట్‌ను ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా బడ్జెట్ హద్దుల్లో ఉండేలా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ..రెండు మూడు అవుట్‌డోర్ లొకేషన్లలోనే రెండు గంటల కథను నడిపించడం విశేషం.
అయితే ఇన్ని ప్రత్యేకతల మధ్య వచ్చిన చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయిందనే చెప్పాలి. కథలో వచ్చే మలుపులు రొటీన్‌గా సాగడం.. అసలు ట్విస్ట్‌కు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ ఫార్ములాలో ఉండటం.. క్లైమాక్స్ తేలిపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తాయి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే దర్శకుడు నీరజ్ పాండే ఈసారి మాత్రం తన స్థాయికి తగ్గ అవుట్‌పుట్‌ను ఇవ్వడంలో తడబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా మరీ తీసిపారేసేలా లేకపోయినా? ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేనట్లుగా సాధారణంగా సాగిపోతుంది.
