Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి శివకార్తికేయన్ మదరాసి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

నిజానికి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఎప్పటినుంచో పలు రకాల డేట్స్ వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా అధికారికంగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

By:  Madhu Reddy   |   26 Sept 2025 3:10 PM IST
ఓటీటీలోకి శివకార్తికేయన్ మదరాసి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
X

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్లో సినిమాలు చేస్తూ.. ఆ తమిళ్ చిత్రాలను ఇటు తెలుగులో కూడా డబ్బింగ్ ద్వారా విడుదల చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా రెమో, డాక్టర్ ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ తాజాగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'మదరాసి'. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కథా కథనం బలంగా లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి కనబరచలేదు.

పైగా ఈ సినిమాకి పోటీగా వచ్చిన ఘాటీ, లిటిల్ హార్ట్స్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా మదరాసి, ఘాటీ సినిమాలతో పోల్చుకుంటే చిన్న సినిమాగా వచ్చిన లిటిల్ హార్ట్స్ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మదరాసి స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఎప్పటినుంచో పలు రకాల డేట్స్ వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా అధికారికంగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

మదరాసి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ఒక సిండికేట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) అనే ఇద్దరు స్నేహితులను రంగంలోకి దింపి ట్రక్కుల కొద్దీ ఆయుధాలను ఆ సిండికేట్ తరలిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇలా తరలించిన ఆయుధాలు అన్నింటిని ఒక ఫ్యాక్టరీకి చేరుస్తారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ గ్రహిస్తుంది. వెంటనే ప్రేమ్ నాథ్ (బిజు మీనన్) నేతృత్వంలోని ఎన్ఐఏ దీనిని ఆపాలని ప్రయత్నం చేసినా అది వీలుపడదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలని ఒక ఆపరేషన్ నిర్వహిస్తారు. అయితే ఇందులో పాల్గొనాలి అంటే ఎవరైనా ఒకరు ప్రాణ త్యాగం చేయాల్సి ఉంటుంది.

అలాంటి సమయంలో సరిగా ప్రేమ్ నాథ్.. వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురామ్ (శివ కార్తికేయన్) ను కలుస్తారు. అయితే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందా? అసలు రఘురాం ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఈయనను ప్రేమ్ నాథ్ ఎలా కలిశారు? మరి వీళ్ళిద్దరి కలయికలో ఆ మిషన్ సక్సెస్ అయ్యిందా? ముఖ్యంగా రఘురామ్ కి ప్రాణాలంటే లెక్కలేనితనం ఎందుకు? ఇలా తదితర విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నిజానికి ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్ ను బాగా మెప్పించింది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టోరీని ముందుకు తీసుకెళ్లలేదని వార్తలు కూడా వినిపించాయి. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ అందుకుంటుందో చూడాలి.