Begin typing your search above and press return to search.

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

‘మహారాణి’ వెబ్‌సిరీస్ ఐదో సీజన్‌లో హ్యూమా ఖురేషి గుండు లుక్‌లో కనిపించనున్నారు. రాణి భారతి పాత్ర కోసం తొలిసారి ఈ ప్రయోగం చేసినట్లు ఆమె వెల్లడించారు. కుమారుడు జై మరణానికి ప్రతీకారం తీర్చుకునే కథతో రూపొందుతున్న ఈ సీజన్ 2027 ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కానుంది.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 10:07 PM IST
పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!
X

మ‌హిళా న‌టీమ‌ణులు గుండుతో న‌టించడం అంటే సాహ‌సంతో కూడుకున్న‌ది. భార‌తీయ సినిమా హిస్ట‌రీలో ఇలాంటి సాహ‌సాలకు వెన‌కాడ‌ని కొంద‌రు న‌టీమ‌ణులు ఉన్నారు. ష‌బానా ఆజ్మీ, అంత‌ర మాలీ, త‌న్వీ ఆజ్మీ వంటి న‌టీమ‌ణులు గ‌తంలో గుండుతో న‌టించి మెప్పించారు. వీరంతా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న న‌టీమ‌ణులు.

ఇప్పుడు ఇదే జాబితాలో హ్యూమా ఖురేషి కూడా బాల్డ్ హెడ్ (గుండు)తో న‌టించి సాహ‌సానికి దిగ‌డం చ‌ర్చ‌గా మారింది. `మ‌హారాణి` వెబ్ సిరీస్ 5వ సీజ‌న్ లో హ్యూమా గుండుతో స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. రాజ‌కీయం, ప్ర‌తీకారం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సిరీస్ లో రాణి భార‌తి అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించిన హ్యూమా ఖురేషి మొద‌టిసారి త‌న న‌ట‌నా కెరీర్ లో ఇలా గుండుతో న‌టించారు. తొలుత బాల్డ్ లుక్ విష‌యంలో త‌ట‌ప‌టాయించినా కానీ.. చివ‌రికి ఇలాంటి ఒక ఛాలెంజ్ ని తీసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు హ్యూమా తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఇటీవ‌ల‌ విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 2027 ఫిబ్రవరిలో ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రూపం రాణి భార‌తి వ్య‌క్తిత్వాన్ని మ‌రింత లోతుగా అర్థం చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని కూడా హ్యూమా అన్నారు. ఈ సాహసోపేత నిర్ణయానికి మద్దతు ఇచ్చిన మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కథాంశం విషయానికి వస్తే.. మహారాణి సీజన్ 5 లో రాణి భారతి ప్రయాణం అత్యంత చీకటి సామ్రాజ్యంలో భావోద్వేగభరితంగా సాగనుంది. గత సీజన్‌లో తన కుమారుడు జై హత్యకు గురికావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన రాణి భారతి.. ఇప్పుడు తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోబోతోంది. ఇప్పటివరకు కేవలం అధికారం, రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడల చుట్టూ సాగిన ఈ సిరీస్.. ఈసారి రాణి ప‌ర్స‌న‌ల్ లాస్ - ప్రతీకార పోరాటం చుట్టూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని హుమా ఖురేషి హింట్ ఇచ్చారు.

సుభాష్ కపూర్ సృజ‌న నుంచి పుట్టుకొచ్చిన‌ ఈ సిరీస్ ఐదో సీజన్‌కు పునీత్ ప్రకాష్ దర్శకత్వం వహించ‌గా.. కాంగ్రా టాకీస్ బ్యానర్‌పై నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందా నిర్మించారు. ఈ సిరీస్ లో రాణి భార‌తి పాత్ర‌లో హ్యూమా న‌ట‌న‌కు గొప్ప పేరు, గుర్తింపు ద‌క్కాయి. సీజ‌న్ 5లో గుండుతో న‌టిగా మ‌రోసారి వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌నుంది.

హ్యూమా ఇటీవ‌ల య‌ష్ `టాక్సిక్`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు ర‌జ‌నీకాంత్ కాలా, అజిత్ వాలిమై లాంటి భారీ ద‌క్షిణాది చిత్రాలలో న‌టించారు.