OTTల విషయంలో అలా చేస్తున్నారా? ఆ స్కామ్ తో జాగ్రత్త!
ఎప్పుడు కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తుందో.. చూసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఓటీటీల సబ్ స్క్రిప్షన్ ధరల విషయంలో కొందరు అక్రమ మార్గాలు ఆశ్రయిస్తున్నారు.
By: M Prashanth | 15 Dec 2025 1:00 AM ISTకోవిడ్ తర్వాత ఓటీటీలు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఆదరణ తక్కువే ఉన్నా.. పాండమిక్ తర్వాత భారీగా పెరిగిపోయింది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎప్పటికప్పుడు నిర్వాహకులు స్ట్రీమింగ్ చేస్తుండడంతో.. చాలామంది మూవీ లవర్స్ ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు.
ఎప్పుడు కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తుందో.. చూసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఓటీటీల సబ్ స్క్రిప్షన్ ధరల విషయంలో కొందరు అక్రమ మార్గాలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇంకేముంది.. సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. వారి స్కామ్స్ లో చిక్కుకుని మోసపోతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో OTT సబ్‌స్క్రిప్షన్ ల పేరిట విదేశాల్లో ఉన్న భారతీయులు అంటే ఎన్‌ఆర్‌ఐలను మోసం చేస్తున్న ఫేక్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నోయిడా సెక్టార్-2లో వెబ్ బిజ్ సర్వీస్ ఎల్ ఎల్ సీ పేరుతో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అమెరికా, ఇతర విదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేల్చారు. నిందితులంతా భారత్, పాకిస్థాన్ తో పాటు అంతర్జాతీయ OTT ప్లాట్ ఫార్మ్ లకు తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ లు ఇస్తామని ఆశ చూపించారని తెలిపారు. ఏడాది నుంచి 27 నెలల వరకు చెల్లుబాటు అయ్యే ప్లాన్ లని చెబుతూ, ఒక్కో సబ్ స్క్రిప్షన్ కు 100 నుంచి 300 అమెరికన్ డాలర్లు వసూలు చేశారని చెప్పారు.
కానీ అవన్నీ ఫేక్ అని గుర్తించినట్లు వెల్లడించారు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా సంప్రదించేవారని, అసలు నంబర్లు బయటపడకుండా స్పూఫ్ చేసిన కాలర్ ఐడీలను ఉపయోగించారని చెప్పారు. నమ్మకం కలిగించేలా మాట్లాడేవారని,. దీంతో చాలామంది ఎన్‌ఆర్‌ఐలు మోసపోయినట్లు తెలిపారు.
పోలీసులు రావడంతో నిందితులు భయాందోళనకు గురై, వెంటనే కార్యకలాపాలను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది స్కామ్ తీవ్రతను మరింత స్పష్టంగా చూపుతోందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద పెద్ద సైబర్ మోసాల నెట్ వర్క్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
ఏదేమైనా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు. తక్కువ ధరలకు సబ్ స్క్రిప్షన్ లు ఇస్తామన్న ఆఫర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నా, అవి మోసాలకు దారితీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ఆఫర్లకు దూరంగా ఉండాలని, మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
