ఓటిటిలోకి వచ్చేసిన కపుల్ ఫ్రెండ్లీ.. ఆ ట్విస్ట్ కే భారీ హైప్!
థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, డిజిటల్ ఆడియన్స్‌ను ఏవిధంగా ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం..
By: Madhu Reddy | 13 March 2026 11:39 AM ISTయంగ్ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన యూత్‌ఫుల్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఓటీటీ సంస్థ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, డిజిటల్ ఆడియన్స్‌ను ఏవిధంగా ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షం.. ఆ స్ట్రీమింగ్ స్టైలే వేరు:
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఈరోజు నుండే అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇక్కడే ఒక వింతైన విషయం చోటు చేసుకుంది. సాధారణంగా ఏదైనా సినిమా మల్టీ లాంగ్వేజస్‌లో రిలీజ్ అయితే, ఒకే వీడియో ఫైల్‌లో రకరకాల ఆడియో ట్రాక్స్ ఇస్తుంటారు. ఇక కానీ ఈ సినిమా విషయంలో ప్రైమ్ వీడియో ప్రతి భాషకు విడివిడిగా వర్షన్లను రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలుగు వర్షన్‌లోనే కన్నడ ఆడియోను కూడా నిశ్శబ్దంగా యాడ్ చేశారు. మిగిలిన భాషల వర్షన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
శివ-మిత్రల ప్రయాణం.. :
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఒక బడ్డింగ్ ఆర్కిటెక్ట్. కెరీర్‌లో రాణించాలనే కలతో చెన్నై చేరుకున్నప్పటికీ, సరైన ప్రాజెక్టు దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. రోజువారీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేసే క్రమంలో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం వెతుకుతున్న చిత్తూరు అమ్మాయి మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. ఇక పరిస్థితుల ప్రభావంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సి రావడంతో, ఆ సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారి లివింగ్ రిలేషన్‌కు దారితీస్తుంది. అంతా సవ్యంగా సాగి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తరుణంలో వారి జీవితాల్లో ఎదురైన ఊహించని మలుపు ఏంటి? ఇక అసలు ఒకే ఇంట్లో ఉండాల్సిన ఆ వింత పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరకు వీరి ప్రేమ కథ పెళ్లి పీటల దాకా ఎలా చేరింది? అనేదే ఈ చిత్రంలోని అసలు సిసలైన కథాంశం.
ఆకట్టుకునే సంగీతం.. రిఫ్రెషింగ్ పెర్ఫార్మెన్స్:
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. సంతోష్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, మానస వారణాసి తన గ్లామర్ మరియు యాక్టింగ్‌తో మెప్పించింది. ఇక ముఖ్యంగా ఆదిత్య రవీంద్రన్ అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్, సినిమాలోని ఆహ్లాదకరమైన విజువల్స్ యూత్‌ను బాగా ఆకర్షించాయి. రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ వంటి నటులు తమ సపోర్టింగ్ రోల్స్‌తో సినిమాకు బలాన్ని చేకూర్చారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసే సౌలభ్యం రావడంతో సినిమా ప్రేమికులు ఖుషీ అవుతున్నారు.
