Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

తెలుగు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన దివి, సోహైల్, అరియానా, హిమజ వంటి వారు సినిమాలు, టీవీ షోలతో కెరీర్ కొనసాగిస్తున్నారు. శివాజీ, నవదీప్, వరుణ్ సందేశ్ వంటి వారికి కూడా ఈ షో కొత్త అవకాశాలు తెచ్చింది. అయితే ప్రస్తుతం సీజన్ 10లో పాల్గొంటున్న దేబ్జానీ, నీతూ, వర్షిణి, అమన్, సుధీర్, ఆటో రాంప్రసాద్ తదితరులకు బిగ్ బాస్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. షో ద్వారా గుర్తింపు వచ్చినా, పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రతిభే కీలకమని చెప్పొచ్చు.

By:  Sivaji Kontham   |   8 Nov 2026 4:42 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?
X

దేశ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత‌గా పాపుల‌రైందో తెలిసిందే. ఈ వేదికపై మెరిసిన చాలా మంది పెర్ఫామ‌ర్లు ఆ త‌ర్వాత భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో న‌టులుగా సెటిల‌య్యారు. కొంద‌రు బిజీ ఆర్టిస్టులుగా కొన‌సాగినా, మ‌రికొంద‌రు అంత‌గా వెల‌గ‌లేక‌పోయిన మాట వాస్త‌వం. ఇక తెలుగు బుల్లితెర‌పై గొప్ప ప్ర‌భావం చూపిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి నాగార్జున హోస్టింగ్ ఎంత పెద్ద ప్ల‌స్సో తెలిసిందే. కింగ్ 60 ప్ల‌స్ ఏజ్ లోను త‌న‌దైన వాక్చాతుర్యం, హోస్టింగ్ నైపుణ్యంతో మెస్మ‌రైజ్ చేస్తున్నారు గ‌నుక‌నే టీఆర్పీ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా తెలుగు లోగిళ్ల‌లో మాస్ ఈ షోని ఆద‌రించ‌డానికి నాగార్జున హోస్టింగ్ ఒక కార‌ణం.

తెలుగు బిగ్ బాస్‌తో ఫేమ‌స్ అయి టాలీవుడ్ లో లేదా బుల్లితెర రంగంలో ఎంత మంది న‌టీన‌టులు డ్రైవ్ చేస్తున్నారు? అనేది ప‌రిశీలిస్తే... చాలా ప‌రిమితంగా మాత్ర‌మే పేర్లు వినిపిస్తున్నాయి. దివి వ‌ద్య‌త - సోహైల్, తేజ‌స్వి మాదివాడ‌, అరియానా గ్లోరీ, హిమజ వంటి కొద్ది మంది బిగ్ బాస్ షో త‌ర్వాత ఇండ‌స్ట్రీలో బాగానే షైన్ అయ్యారు. అయితే వీరంతా పెద్ద స్టార్లు అయిపోలేదు. కెరీర్ ని నెమ్మ‌దిగా ముందుకు న‌డిపించ‌గ‌లిగారు. దివి వ‌ద్య‌త వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో షైన్ అవుతున్నారు. అరియానా ఇటీవ‌ల టీవీ షోల‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు కే.రాఘ‌వేంద్ర‌రావుతో అరియానా ఇంట‌ర్వ్యూ కూడా వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. చంద్ర‌యాన్ అనే షోకు హోస్టింగ్ చేస్తోంది. స‌య్య‌ద్ సోహైల్ న‌టుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. హిమ‌జ బుల్లితెర‌, వెండితెర న‌టిగా కొన‌సాగుతోంది. 2015 నుంచి హిమ‌జ సినిమాల్లో కొన‌సాగుతున్నారు.

బిగ్ బాస్ లోకి రాకముందే నటీనటులుగా ఫేమ్ ఉన్న తార‌లు ఉన్నారు. శివాజీ, న‌వ‌దీప్, వ‌రుణ్ సందేశ్, వితిక శేరు,హ‌రితేజ‌, శ్రీ‌ముఖి లాంటి వారు సినిమాలలో అంత‌కుముందే రాణించారు. అయితే వెండితెర‌ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతున్న కొంద‌రికి బిగ్ బాస్ కొంత ప్ల‌స్ అయింది. తిరిగి రీజ‌న‌వేట్ అయ్యి అడ‌పాద‌డ‌పా కొన్ని అవ‌కాశాల్ని అందుకున్నారు. ఇటీవ‌ల కొన్ని హిట్ సినిమాలతో న‌టుడు శివాజీ రీబూట్ అయిన తీరు అంద‌రికీ తెలిసిందే. ఇక న‌వదీప్ వ‌రుస‌గా టీవీ రియాలిటీ షోల‌తో పాటు, అప్పుడ‌ప్పుడు సినిమాల‌తోను సంద‌డి చేస్తున్నారు. వ‌రుణ్ సందేశ్ తిరిగి హీరోగా రాణించేందుకు టీవీ షోల‌ను కూడా ఉప‌యోగించుకుంటున్నాడు.

ప్ర‌స్తుత బిగ్ బాస్ సీజ‌న్ 10లో దేబ్జానీ, నీతూ, వర్షిణి, అమన్, సుధీర్, నరేష్, ఆటో రాంప్రసాద్, శివ కుమార్, త్రిగుణ్, ముకేష్ గౌడ, టెంపర్ వంశీ వంటి వారు ప్రేక్ష‌క దేవుళ్ల దృష్టిని ఆక‌ర్షించారు. వీరంతా బిగ్ బాస్ సీజ‌న్‌ని ముగించాక వెండితెర‌పైనా వెలుగుతారా? అన్న‌ది వేచి చూడాలి. వారి ప్ర‌తిభ ఆధారంగా అవ‌కాశాలు క‌ల్పించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెన‌కాడ‌రు. కానీ అవ‌కాశాలు ఎంద‌రిని వ‌రిస్తాయి? బిగ్ బాస్ వీళ్ల‌కు ఏమేర‌కు క‌లిసొస్తుంది? అన్న‌ది వేచి చూడాలి. బిగ్ బాస్ షో పార్టిసిపెంట్‌లోని ప్ర‌తిభ‌ను, వ్య‌క్తిత్వాన్ని ఎలివేట్ చేస్తుంది. దాని ఆధారంగా వారికి ప‌రిశ్ర‌మ‌లు సూట‌య్యే అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. వీళ్ల‌లో కొంద‌రు ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌రం లేక‌పోవ‌చ్చని కూడా నిరూప‌ణ అయింది! వేదిక ఏదైనా దూసుకుపోయే ట్యాలెంట్ వ్య‌క్తులు లేదా న‌టీన‌టుల్లో ఉండాలి.