Bigg Boss Telugu 10: మాజీ విన్నర్ల సందడితో హౌస్‌లో కొత్త జోష్
బిగ్‌బాస్ 10లో బడ్డీ అప్ టాస్క్‌లు ముగిశాయి. మాజీ విన్నర్లు సిరి, వీజే సన్నీ, నిఖిల్, పృథ్వీ హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించారు. నరేష్, సన్నీ జంటతో పాటు సుధీర్, నిఖిల్ జంట విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. శుక్రవారం అసలు కెప్టెన్సీ పోరు జరగనుంది.
By: Priya Chowdhary Nuthalapti | 27 Nov 2026 9:29 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో 'బడ్డీ అప్' థీమ్ సందడి కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సిరి హన్మంత్, వీజే సన్నీ, నిఖిల్ మలియక్కల్ మరియు పృథ్వీ గెస్ట్‌లుగా హౌస్‌లోకి అడుగుపెట్టి సందడి చేశారు. ఒకవైపు హౌస్‌మేట్స్ ఆటతీరుపై వీరు చేసిన విశ్లేషణలు, మరోవైపు కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం జరిగిన హోరాహోరీ టాస్క్‌లు ఎపిసోడ్‌ను రక్తి కట్టించాయి.
హౌస్‌లోకి మొదటగా సిరి హన్మంత్ మరియు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి రాగానే సన్నీ ప్రతి కంటెస్టెంట్ ఆటతీరును విశ్లేషిస్తూ.. వారిలోని పాజిటివ్ మరియు నెగెటివ్ అంశాలను ఎంతో చక్కగా వివరించాడు.
అనంతరం వీరిద్దరూ కంటెస్టెంట్లతో కలిసి ఫిజికల్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఈ గేమ్‌లో వర్షిణి - సిరి ఒక జట్టుగా, నరేష్ - సన్నీ మరో జట్టుగా తలపడ్డారు.
గేమ్ మొదలవ్వగానే జబర్దస్త్ నరేష్ తన పూర్తి బలాన్ని ఉపయోగించి షీట్‌ను వేగంగా బద్దలు కొట్టి సన్నీకి బాల్స్ అందించాడు. మరోవైపు వర్షిణి తన షీట్‌ను బద్దలు కొట్టడానికి చాలాసేపు చెమటోడ్చి కష్టపడాల్సి వచ్చింది. అప్పటికే నరేష్ గేమ్ పూర్తి చేయడంతో నరేష్ - సన్నీ జంట విజయం సాధించింది. దీంతో నరేష్ కెప్టెన్సీ కంటెండర్ రేసులోకి అడుగుపెట్టాడు.
ఓటమి తర్వాత వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "నేను ఫిజికల్ గేమ్స్ ఆడటం లేదని అందరూ తిడతారు. కానీ తీరా నేను కష్టపడి ఆడుతుంటే ముఖేష్ తప్ప నన్ను ఎవరూ సపోర్ట్ చేయడం లేదు, అందరూ నరేష్‌కే సపోర్ట్ చేస్తున్నారు" అంటూ ఏడ్చేసింది.
సిరి, సన్నీ తర్వాత హౌస్‌లోకి మాజీ విన్నర్ నిఖిల్ మలియక్కల్ మరియు పృథ్వీ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరితో జరిగిన తదుపరి గేమ్‌లో సుధీర్ - నిఖిల్ ఒక జట్టుగా, వంశీ - పృథ్వీ మరో జట్టుగా పోటీపడ్డారు. ఈ పోరులో సుధీర్ మరియు నిఖిల్ జంట విజయం సాధించింది.
ఇలా బడ్డీ అప్ టాస్క్‌ల ద్వారా కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక ప్రక్రియ ముగియగా.. అసలైన కెప్టెన్సీ టాస్క్ శుక్రవారం నాడు జరగనుంది.
