Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ భావోద్వేగాలు, సరదా సంభాషణలతో సాగింది. రామ్‌ప్రసాద్ తల్లి ఆటతీరుపై సూచనలు ఇవ్వగా, దేబ్జానీ తల్లిదండ్రులు గేమ్‌లో మెరుగుపడాలని హింట్స్ ఇచ్చారు. సుధీర్ కాలికి గాయం చూసి అతడి తల్లి రమాదేవి కన్నీరుపెట్టుకోవడం హౌస్‌మేట్స్‌ను కదిలించింది.
By: Priya Chowdhary Nuthalapti | 13 Nov 2026 9:36 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 'ఫ్యామిలీ వీక్' ఎపిసోడ్లు హౌస్‌లో ఒకవైపు కంటతడి పెట్టిస్తూనే, మరోవైపు మధురమైన జ్ఞాపకాలను పంచుతున్నాయి. పదవ వారంలో భాగంగా 67వ రోజు హౌస్‌లో జరిగిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీలు, హౌస్‌లో నడిచిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఎపిసోడ్లో దేబ్జానీ తల్లిదండ్రులతో పాటు, సుధీర్ తల్లి ఇంట్లోకి వచ్చి మంచి హింట్స్ ఇచ్చారు వాళ్ళకి.
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ముందుగా కమెడియన్ రామ్‌ప్రసాద్ కోసం ఆయన తల్లి మరియు కూతురు ఉజ్జ్వల హౌస్‌లోకి అడుగుపెట్టారు. హౌస్‌లోకి రాగానే రామ్‌ప్రసాద్ తల్లి నేరుగా కిచెన్‌లోకి వెళ్లి కొడుకు కోసం తన చేతులతో స్వయంగా ఆయనకు ఇష్టమైన టీ తయారు చేసి ఇచ్చారు. ఇక తనలో ఉన్న లోపాలు ఏంటని రామ్‌ప్రసాద్ అడగ్గా.. "నువ్వు అవతలి వాళ్ల తప్పులను సరిగ్గా ఎత్తి చూపలేకపోతున్నావు" అని తల్లి హితవు పలికారు. అంతే కాకుండా, ప్రతీ వారం ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పడం మానెయ్యమని ఆవిడ సలహా కూడా ఇచ్చారు.
ఆ తర్వాత దేబ్జానీ తల్లిదండ్రులు హౌస్‌లోకి ప్రవేశించారు. వారు హౌస్‌లోని తోటి కంటెస్టెంట్లందరితోనూ ఎంతో ఆప్యాయంగా, ఉత్సాహంగా మాట్లాడారు. ముఖ్యంగా జబర్దస్త్ నరేష్‌తో దెబ్జానీ తండ్రి చేసిన సరదా సంభాషణలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అయితే వాళ్లిద్దరూ కూతుర్ని కూర్చోపెట్టుకుని గేమ్ ఇంకా బాగా ఆడాలని మంచి హింట్స్ ఇచ్చారు. త్రిగుణ్ తో కూడా బాగా ఉండాలని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం విశేషం.
ఆ తర్వాత సుధీర్ తల్లి రమాదేవి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొడుకు కాలికి తగిలిన గాయాన్ని చూడగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి ఏడుస్తున్న తల్లిని చూసి మిగతా హౌస్‌మేట్స్ అందరూ చలించిపోయి, ఆమెను ఓదార్చారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఈ స్థాయికి రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని, తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు సుధీర్ గురించే మాట్లాడుతుంటే ఒక తల్లిగా ఎంతో సంతోషంగా అనిపిస్తోందని భావోద్వేగంతో పంచుకున్నారు.
ఇక చూడబోతే, ఈ ఎపిసోడ్ ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా సుధీర్ మరికొన్ని వారాలు ఇంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
