Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది. హౌస్‌ను బీబీ స్కూల్‌గా మార్చి నరేష్ ప్రిన్సిపాల్‌గా, వర్షిణి, నీతు, దెబ్జానీ టీచర్లుగా సందడి చేశారు. నరేష్ తమ్ముడు సురేష్, శ్వేత తండ్రి, సోదరి, వంశీ భార్య, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్లు భావోద్వేగానికి గురయ్యారు. వంశీకి త్రిగుణ్ అందిస్తున్న సపోర్ట్‌ను శిరీష ప్రత్యేకంగా ప్రశంసించింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 Nov 2026 9:27 AM IST
Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. ఇందులో భాగంగా హౌస్‌ను సరదాగా 'బిబి స్కూల్' గా మార్చి నవ్వులు పూయించగా.. మరోవైపు కుటుంబ సభ్యుల ఎంట్రీలు హౌస్‌లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి.

బిగ్‌బాస్ హౌస్‌ను ఒక పాఠశాలగా మార్చి కంటెస్టెంట్లకు ప్రత్యేక పాత్రలు కేటాయించారు. వర్షిణి కెమిస్ట్రీ టీచర్‌గా, నీతు డాన్స్ టీచర్‌గా, దెబ్జానీ తెలుగు టీచర్‌గా వ్యవహరించగా.. జబర్దస్త్ నరేష్ ప్రిన్సిపాల్‌గా మారి తనదైన శైలిలో స్కూల్‌ను నడిపించాడు. మిగతా సభ్యులంతా విద్యార్థుల గెటప్‌లో కనిపించి సందడి చేశారు. నరేష్ స్టూడెంట్స్ హాజరు తీసుకోవడం, వారిని ప్రశ్నలు అడగడం, ప్రిన్సిపాల్‌ను స్టూడెంట్స్ ఏడిపించడం వంటి సరదా సన్నివేశాలతో హౌస్ నవ్వులతో నిండిపోయింది. వర్షిణి కెమిస్ట్రీ క్లాస్‌లోనూ మంచి కామెడీ పండింది.

స్కూల్ టాస్క్ నడుస్తుండగానే ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మొదటి ఎంట్రీగా నరేష్ తమ్ముడు సురేష్ హౌస్‌లోకి అడుగుపెట్టి అన్నకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తమ్ముడిని చూడగానే నరేష్ భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. సురేష్ మాట్లాడుతూ.. నరేష్ ఆట మొదటి రోజు నుంచే అద్భుతంగా ఉందని, తను ఊహించిన దానికంటే చాలా బాగా ఆడుతున్నాడని ప్రశంసించాడు.

అనంతరం దెబ్జానీతో మాట్లాడిన సురేష్.. హౌస్‌లో ఎక్కడైనా నరేష్ తప్పు చేసి ఉంటే తమ కుటుంబం తరఫున క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. దెబ్జానీ కూడా సానుకూలంగా స్పందిస్తూ తాను తప్పు చేసి ఉంటే క్షమాపణ అడుగుతానని చెప్పడంతో ఇద్దరి మధ్య పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

ఆ తర్వాత శ్వేత తండ్రి హరి కిషోర్ మరియు సోదరి స్వాతి హౌస్‌లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులను చూడగానే శ్వేత కంటతడి పెట్టుకుంది. ఈ సందర్భంగా త్రిగుణ్ తనకు చాలా సపోర్ట్ చేస్తూ మంచి సలహాలు ఇస్తాడని శ్వేత చెప్పగా.. శ్వేత చాలా మంచి అమ్మాయి అని, ఎంతో నిజాయితీగా ఆడుతుందని త్రిగుణ్ వాళ్ల నాన్నతో చెప్పాడు. శ్వేత సోదరి కూడా ఆమెకు స్నేహితుల విషయంలో తగిన స్టాండ్ తీసుకోవాలని సలహా ఇచ్చింది.

ఆ తర్వాత టెంపర్ వంశీ కూతురు ఆర్య హౌస్‌లోకి రాగానే హౌసంతా ఆనందంతో నిండిపోయింది. చిన్నారి ఆర్య అందరితోనూ కలసిపోతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించింది. ఆ తర్వాత వంశీ భార్య శిరీష ఎంట్రీ ఇచ్చి.. వంశీ ప్రతి విషయంలోనూ పాయింట్లు పట్టుకుంటూ చాలా బాగా ఆడుతున్నాడని మెచ్చుకుంది. ముఖ్యంగా త్రిగుణ్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. "స్నేహం అంటే ఇలాగే ఉండాలి.. వంశీకి నువ్వు చాలా సపోర్ట్ చేస్తున్నావు, త్రిగుణ్ నిజంగానే గేమ్ చేంజర్" అని కొనియాడింది.