Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: చివరి కెప్టెన్సీ టాస్క్‌లో దెబ్జానీ విజయం!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 చివరి కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి, త్రిగుణ్ మధ్య పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆటలో వర్షిణి తప్పుకోగా, చివర్లో ఆర్పీ నిర్ణయంతో ఆర్కేకు నిరాశ ఎదురైంది. తీవ్ర వాగ్వాదాలు, ఉత్కంఠ మధ్య దెబ్జానీ హౌస్ చివరి కెప్టెన్‌గా నిలిచింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Nov 2026 9:19 AM IST
Bigg Boss Telugu 10: చివరి కెప్టెన్సీ టాస్క్‌లో దెబ్జానీ విజయం!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పన్నెండో వారంలో జరుగుతున్న కెప్టెన్సీ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా, మాటల తూటాలతో సాగింది. ఆర్కే, శివ, దెబ్జానీ, సుధీర్, నరేష్, అమన్‌లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలవగా.. మిగిలిన నలుగురికి మరో అవకాశం ఇస్తూ బిగ్‌బాస్ పెట్టిన ఆటలో వర్షిణి - త్రిగుణ్ మధ్య పాత వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి.

మిగిలిన నలుగురి కోసం జరిగిన గేమ్‌లో.. త్రిగుణ్, వంశీ, రామ్‌ప్రసాద్ కలిసి ముఖేష్‌తో ఆడాలని భావించగా, ముఖేష్ - వర్షిణి మాత్రం త్రిగుణ్‌ను పక్కన పెట్టాలనుకున్నారు. ఈ క్రమంలో వర్షిణి సారీ చెబితే ఓటు మారుస్తానని త్రిగుణ్ అనడంతో వివాదం మొదలైంది.

"నన్ను క్యారెక్టర్‌లెస్ అన్నావు, నేను ఎందుకు సారీ చెప్పాలి? ఈ హౌస్‌లో నేను ఎవరితో తిరిగాను? నా క్యారెక్టర్ గురించి అలా ఎలా అంటావు?" అంటూ వర్షిణి కన్నీటి పర్యంతమైంది.

త్రిగుణ్ అలా అనలేదని వంశీ, ఆర్పీ, శివ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, ముఖేష్ కూడా కోపంలో మాటలు జారవద్దని వర్షిణికి నచ్చజెప్పాడు. చివరకు వర్షిణి గేమ్ నుంచి తప్పుకుంది. అనంతరం ఆర్పీ, వంశీ, ముఖేష్, త్రిగుణ్ మధ్య జరిగిన పోటీలో.. ముఖేష్ ఎంత అడ్డుకున్నా రామ్‌ప్రసాద్ విజయం సాధించాడు.

చివరి కెప్టెన్సీ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. క్యాండీ షాప్‌లో తమ సపోర్టర్స్ బాక్స్‌లలో క్యాండీలను వేసి నింపుకునే ఈ టాస్క్‌లో.. మొదటి రౌండ్‌లో శివ ఔట్ అయ్యాడు. రెండో రౌండ్‌కు సంచాలకుడిగా వచ్చిన శివ.. అమన్ బాక్స్‌ను త్రిగుణ్ కిందపడేయడంతో అతడిని డిస్‌క్వాలిఫై చేశాడు. మూడో రౌండ్‌లో అమన్ సంచాలకుడిగా ఉండగా సుధీర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సుధీర్ సంచాలకుడిగా మారిన రౌండ్‌లో రామ్‌ప్రసాద్ మరియు నరేష్ ఎలిమినేట్ అయ్యారు.

చివరికి నిలిచిన కంటెండర్లలో.. ఫిజికల్ కాకూడదనే కండిషన్‌తో ఆర్పీ రంగంలోకి దిగడంపై రామకృష్ణ తీవ్రంగా వాదించాడు. ముందుగానే దెబ్జానీని కెప్టెన్ చేయాలని మిగతా వారంతా ఫిక్స్ అయిపోయారని, అందుకే ఆర్పీ అలాంటి కండిషన్ పెట్టాడని ఆర్కే ఆరోపించాడు.

చివరకు క్యాండీలను పట్టించుకోకుండా ఆర్పీ.. ఆర్కేను పక్కన పెట్టి దెబ్జానీని విజేతగా నిలబెట్టాడు. తనకు జరిగిన అన్యాయానికి ఆర్కే తీవ్ర ఆవేదనతో ఏడ్చేశాడు. ఎట్టకేలకు ఈ ఉత్కంఠ పోరులో దెబ్జానీ బిగ్‌బాస్ హౌస్ చివరి కెప్టెన్‌గా నిలిచింది.