కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?
కీర్తి నటనకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు కనిపిస్తున్నాయి. భవాని పాత్రలో ఆమె హావభావాలు, గంభీరంగా కనిపించిన తీరు బాగున్నాయని కొందరు పోస్టులు పెడుతున్నారు.
By: M Prashanth | 1 Nov 2026 10:44 AM ISTఇద్దరు మంచి నటీమణులు, 80వ దశకం నేపథ్యం, ఇప్పటివరకు ఎక్కువగా చూడని ఓ కథ. ట్రైలర్ వచ్చినప్పుడే 'అక్క' వెబ్ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. పైగా కీర్తి సురేష్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకుల నుంచి ఒకే రకమైన రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సిరీస్‌లోని కొన్ని అంశాలకు ప్రశంసలు వస్తుండగా, కథనం విషయంలో డిఫరెంట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి.
కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన ఈ సిరీస్ అక్టోబర్ 30న విడుదలైంది. 1980ల కాలంలో పెర్నూరు అనే ఊరిని మహిళలే పాలిస్తుంటారు. అక్కడ భవానిగా కీర్తి కనిపించగా, ఆమె అధికారాన్ని సవాల్ చేసే రుద్ర పాత్రలో రాధికా నటించారు. ఇద్దరి మధ్య అధికారం కోసం జరిగే పోరాటంతో కథ సాగుతుంది. మహిళల చేతుల్లో పాలన అనే కాన్సెప్ట్ కొత్తగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కీర్తి నటనకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు కనిపిస్తున్నాయి. భవాని పాత్రలో ఆమె హావభావాలు, గంభీరంగా కనిపించిన తీరు బాగున్నాయని కొందరు పోస్టులు పెడుతున్నారు. రాధికా ఆప్టే నటనకు కూడా సానుకూల స్పందన ఉంది. అయితే మరికొందరు మాత్రం ఇద్దరి పాత్రలను ఇంకా బలంగా రాసి ఉండాల్సిందని అంటున్నారు. ముఖ్యంగా రాధికా పాత్రలో కోపానికి తగ్గ కారణాలను కథలో సరిగ్గా చూపించలేదనే కామెంట్స్ వస్తున్నాయి.
కథ విషయంలోనే ఎక్కువ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మొదట ఆసక్తికరంగా మొదలైనా, తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగేలా ఉందంటున్నారు. పాత్రలు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఎవరితో సంబంధముందో అర్థం చేసుకోవడం కష్టమైందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అధికారం, ప్రతీకారం చుట్టూ కథ తిరుగుతున్నా పాత్రల బాధను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారనే అభిప్రాయమూ వినిపిస్తోంది.
మరోవైపు సిరీస్ మేకింగ్‌ను మెచ్చుకుంటున్నవాళ్లూ ఉన్నారు. భారీ సెట్లు, కాస్ట్యూమ్స్, అప్పటి వాతావరణాన్ని చూపించిన విధానం బాగున్నాయంటున్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఆ భారీ హంగులకు తగ్గ స్థాయిలో కథ లేదనే విమర్శలూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హింస ఎక్కువగా ఉందని, యాక్షన్ మరింత బాగా ఉండాల్సిందని అంటున్నారు. మోనికా పన్వార్ నటనకు కూడా మంచి కామెంట్స్ కనిపిస్తున్నాయి.
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు. మొత్తం ఐదు ఎపిసోడ్లు ఉండగా, నిడివి దాదాపు మూడు గంటలు. తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉంది. చివరి ఎపిసోడ్‌లోని కొన్ని మలుపులు కూడా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేదనే అభిప్రాయాలున్నాయి. మొత్తంగా సోషల్ మీడియాలో కీర్తి నటనకు మంచి ప్రశంసలు అయితే వస్తున్నాయి. కానీ ఆ సిరీస్ కథకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదు.
