Begin typing your search above and press return to search.

2007.. 2026..సీన్ రిపీట్..టి20 ప్ర‌పంచ క‌ప్ లో తొలి సంచ‌ల‌నం న‌మోదు

శుక్ర‌వారం గ్రూప్ బిలో భాగంగా కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో మాజీ చాంపియ‌న్ ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో జింబాబ్వే 23 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

By:  Tupaki Gallery Desk   |   13 Feb 2026 4:08 PM IST
2007.. 2026..సీన్ రిపీట్..టి20 ప్ర‌పంచ క‌ప్ లో తొలి సంచ‌ల‌నం న‌మోదు
X

నేపాల్ చేతిలో ఇంగ్లండ్ చ‌చ్చీచెడి గెలిచింది.. అమెరికాపై భార‌త్ ప‌రాజ‌యం త‌ప్పించుకుంది.. పాకిస్థాన్ కు నెద‌ర్లాండ్స్ షాక్ ఇచ్చినంత ప‌ని చేసింది.. ద‌క్షిణాఫ్రికాను అఫ్ఘానిస్థాన్ ఓడించిందేమో అనిపించింది..! ఈ చిన్న జ‌ట్లేవీ సంచ‌ల‌నం న‌మోదు చేయ‌లేక‌పోయాయి..! కానీ, గ‌త టి20 ప్ర‌పంచ క‌ప్ లో చాన్స్ మిస్ అయి.. ఈ సారి మాత్రం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి బెర్తు ద‌క్కించుకున్న జింబాబ్వే సెన్సేష‌న్ రికార్డు చేసింది. అచ్చం 2007 నాటి తొలి టి20 ప్ర‌పంచ క‌ప్ త‌ర‌హాలోనే ఇప్పుడు కూడా అద్భుతం సాధించింది. శుక్ర‌వారం గ్రూప్ బిలో భాగంగా కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో మాజీ చాంపియ‌న్ ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో జింబాబ్వే 23 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

అప్పుడు ఇప్పుడు

టి20 ప్ర‌పంచ‌ క‌ప్ లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే గండం ఉన్న‌ట్లుంది. లేక‌పోతే.. ఏంటి? 2007లో, మ‌ళ్లీ ఇప్పుడు కూడా ఆ జ‌ట్టు త‌మ కంటే ఎన్నో మెట్లు కింద ఉండే జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. తొట్ట తొలిగా 2007లో నిర్వ‌హించిన టి20 ప్ర‌పంచ క‌ప్ లో జింబాబ్వే.. నాటి వ‌న్డే ప్ర‌పంచ‌ చాంపియ‌న్ అయిన ఆస్ట్రేలియాను ప‌రాజ‌యం పాల్జేసింది. తాజాగా ఇప్పుడు కూడా ఓడించింది. విచిత్రం ఏమంటే.. ఈ రెండు జ‌ట్లు టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌లో త‌ల‌ప‌డింది ఈ రెండు సార్లే. అంటే, టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో జింబాబ్వేపై ఆసీస్ కు గెలిచిన చ‌రిత్ర లేద‌న్న‌మాట‌.

గాయాలు.. వైఫ‌ల్యాలు..

ఇటీవ‌ల ఆస్ట్రేలియా టి20 జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఏమంత బాగోలేదు. పైగా ఆ జ‌ట్టును గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. స్వ‌యంగా టి20 కెప్టెన్ షాన్ మార్ష్ గాయం కార‌ణంగా గ‌త మ్యాచ్ నుంచి త‌ప్పుకొన్నాడు. టెస్టు, వ‌న్డే సార‌థి ప్యాట్ క‌మ్మిన్స్, మేటి పేస‌ర్ హేజిల్ ఉడ్ టోర్నీకే దూర‌మ‌య్యారు. దీంతో విధ్వంస‌క ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ సార‌థ్యం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ఆట‌గాళ్ల ఫామ్ కూడా గొప్ప‌గా లేదు.

170 కొట్ట‌లేక‌..

శుక్ర‌వారం జింబాబ్వేపై 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది ఆస్ట్రేలియా. తొలుత జింబాబ్వేను 169 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. ఓపెన‌ర్ బ్రియాన్ బెన్నెట్ 56 బంతుల్లో 66 రాణించాడు. మ‌రో ఓపెన‌ర్ మౌర్మానీ 21 బంతుల్లోనే 35 ప‌రుగులు సాధించాడు. ఆస్ట్రేలియా మాత్రం 146 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రెన్ షా (65) దూకుడుగా ఆడి హాఫ్ సెంచ‌రీ చేసినా మిగ‌తా జ‌ట్టంతా కూడా 100 కొట్ట‌లేక‌పోయింది. విధ్వంస‌క ఆట‌గాళ్లు హెడ్ (17), ఇంగ్లిస్ (8) విఫ‌లం కాగా, ఆల్ రౌండ‌ర్లు కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ డ‌కౌట్ అయ్యారు. మ్యాక్స్ వెల్ 31 బంతుల్లో 32 ప‌రుగులు చేశాడు. 19.3 ఓవ‌ర్ల‌లోనే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జింబాబ్వే పేస‌ర్ ముజ‌ర‌బ్బానీ 17 ప‌రుగుల‌కే 4 వికెట్లు తీశాడు. ఇవాన్స్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.