Begin typing your search above and press return to search.

మొన్న పరాగ్.. ఇప్పుడు చాహల్.. అందరిముందే క్రీడాకారులు తెగించేస్తున్నారు..

చాహల్ గతంలోనూ ఒకసారి కారులో ప్రయాణిస్తూ సిగరెట్ తాగి, ఆ పీకను రోడ్డుపై పడేసిన వీడియో బయటకు వచ్చి విమర్శలపాలయ్యారు.

By:  A.N.Kumar   |   8 May 2026 8:45 AM IST
మొన్న పరాగ్.. ఇప్పుడు చాహల్.. అందరిముందే క్రీడాకారులు తెగించేస్తున్నారు..
X

భారత దేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం. క్రికెటర్లను దైవ సమానులుగా ఆరాధించే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. మైదానంలో వారు చేసే విన్యాసాల నుంచి వ్యక్తిగత జీవితంలో వారు పాటించే అలవాట్ల వరకు ప్రతిదీ యువతపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇటీవల కాలంలో కొందరు స్టార్ క్రికెటర్ల బాధ్యతారాహిత్య ప్రవర్తన క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ విమాన ప్రయాణంలో ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.

అసలేం జరిగింది?

ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో విమానంలో జట్టు సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న చాహల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ-సిగరెట్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు సాషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విమాన ప్రయాణంలో ధూమపానం లేదా వేపింగ్ చేయడం కఠినమైన భద్రతా నిబంధనల ప్రకారం నేరం. పైగా భారతదేశంలో ఈ-సిగరెట్ల విక్రయం, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఇలాంటి తరుణంలో ఒక బాధ్యతాయుతమైన జాతీయ క్రీడాకారుడు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

వరుస వివాదాల్లో 'స్టార్' ప్లేయర్లు

క్రికెటర్లు ఇలా వేపింగ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం రియాన్ పరాగ్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివాదం మరువక ముందే చాహల్ వంటి సీనియర్ ఆటగాడు ఇలాంటి చర్యకు పాల్పడటం గమనార్హం.

చాహల్ గతంలోనూ ఒకసారి కారులో ప్రయాణిస్తూ సిగరెట్ తాగి, ఆ పీకను రోడ్డుపై పడేసిన వీడియో బయటకు వచ్చి విమర్శలపాలయ్యారు. పదేపదే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల అతడి క్రమశిక్షణపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. "అభిమానులు మిమ్మల్ని రోల్ మోడల్స్‌గా చూస్తారు.. మీరు ఇచ్చే సందేశం ఇదేనా?" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆరోగ్యానికి ముప్పు.. చట్టానికి తూట్లు!

వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఈ-సిగరెట్లు సాధారణ సిగరెట్ల కంటే తక్కువ ప్రమాదకరమని కొందరు భావించినప్పటికీ, అవి ఊపిరితిత్తులు.. గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. యువతను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకే ప్రభుత్వం వీటిని నిషేధించింది. సెలబ్రిటీలు ఇలాంటి అలవాట్లను ప్రదర్శించడం వల్ల యువత వీటి వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా?

సాధారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి క్రీడాకారుల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆటగాళ్ల మైదాన ప్రవర్తనతో పాటు మైదానం వెలుపల వారి ప్రవర్తన కూడా బోర్డు నిబంధనల పరిధిలోకి వస్తుంది. విమానయాన నిబంధనలను ఉల్లంఘించడం.. నిషేధిత వస్తువులను వాడటంపై బోర్డు వివరణ కోరే అవకాశం ఉంది.

కోట్లాది రూపాయల పారితోషికాలు, స్టార్ హోదా అనుభవిస్తున్న క్రీడాకారులు తమ సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. కేవలం వికెట్లు తీయడమే కాదు.. సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడంలో కూడా వారు 'ఛాంపియన్లు'గా నిలవాలి. మరి ఈ వివాదంపై యుజ్వేంద్ర చాహల్ లేదా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.