తాగుడు అదుపు తప్పింది.. మానసికంగా కుంగిపోయాను: చాహల్
విడాకుల తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, తీవ్రమైన మానసిక అశాంతికి గురిచేసాయని చాహల్ తెలిపారు.
By: Sivaji Kontham | 16 Oct 2026 12:50 PM ISTభారత స్టార్ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చాహల్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రోజులు, మద్యం వ్యసనం.. మానసిక ఒత్తిళ్ల గురించి సంచలన నిజాలను వెల్లడించారు. మాజీ భారత ఓపెనర్ ఆకాష్ చోప్రాతో జరిగిన ఒక పాడ్కాస్ట్ ముఖాముఖిలో చాహల్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన వైఫల్యాలు తనను ఎంతగా కృంగదీశాయో.. దాని నుంచి బయటపడటానికి తాను చేసిన పోరాటాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మైదానంలో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే చాహల్.. తెరవెనుక తీవ్రమైన మానసిక ఆందోళనను.. ఆల్కహాల్ వ్యసనాన్ని ఎదుర్కొన్నానని చెప్పడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
విడాకుల తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, తీవ్రమైన మానసిక అశాంతికి గురిచేసాయని చాహల్ తెలిపారు. 2020 డిసెంబర్లో ధనశ్రీతో వివాహం జరిగిన అనంతరం మార్చి 2025లో వీరు విడాకులు తీసుకున్నారు. ఈ వ్యక్తిగత సంక్షోభం ఆయన క్రికెట్ ప్రదర్శనపై, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు.. వార్తలు తనను మరింత కుంగదీశాయని.. ఆ మనస్తాపంతోనే జట్టుకు భారం కాకూడదనే ఉద్దేశంతో వైట్ బాల్ మ్యాచ్లకు కొంతకాలం విరామం తీసుకున్నానని చాహల్ వెల్లడించారు.
మద్యం అలవాటు హద్దులు దాటిపోవడంతో తన కెరీర్తో పాటు జీవితం కూడా నాశనమవుతుందనే భయం తనలో మొదలైందని చాహల్ పేర్కొన్నారు. గతేడాది ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ముగిసిన తర్వాత పరిమితులు దాటడంతో వెంటనే మేల్కొని ఏకంగా 26 రోజుల పాటు రిహాబిలిటేషన్ (రిహాబ్) సెంటర్లో చేరినట్లు తెలిపారు. ఆ 26 రోజుల రిహాబ్ జీవితం తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని.. మళ్లీ శరీరంపై, మనస్సుపై నియంత్రణ సాధించి ఎమోషనల్గా సమతుల్యతను సంపాదించుకున్నానని ఆయన చెప్పారు.
ఈ కఠిన సమయంలో తనకు యాంగ్జైటీ (ఆందోళన), పానిక్ అటాక్స్ ఎదురయ్యాయని.. అవి శారీరక రూపంలో కూడా బయటపడేవని చాహల్ వివరించారు. పానిక్ అటాక్ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడమే కాకుండా.. ముఖం చిన్నదైపోయి పెదవులు ఒకవైపు లాగేసేవని.. దానివల్ల సరిగ్గా మాట్లాడటం కూడా సాధ్యమయ్యేది కాదని చెప్పారు. ఆ క్షణాల్లోనే యాంగ్జైటీ తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో తాను మొదటిసారి గ్రహించానని.. ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేసి పూర్తి దృష్టిని మళ్లీ క్రికెట్పైనే పెట్టాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.
రిహాబ్ తర్వాత మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించి.. కొత్త ఆశలతో ఐపీఎల్లోకి అడుగుపెట్టినట్లు చాహల్ వివరించారు. పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు తనను వేలంలో కొనుగోలు చేసినప్పుడు.. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల పెరిగిందని అన్నారు. ఐపీఎల్లో 188 మ్యాచ్ల్లో 233 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన చాహల్.. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ఎంతో ప్రశాంతమైన.. ఆనందకరమైన స్థానంలో ఉన్నానని.. ఆటపై తనకున్న ప్రేమే తనను ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేసిందని స్పష్టం చేశారు.
