Begin typing your search above and press return to search.

సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ లో యువ ఓపెన‌ర్ అభిషేక్...అత‌డి ఫోన్ తోనే భ‌యం

అభిషేక్ శ‌ర్మ కొట్టే సిక్స‌ర్లు అచ్చం యువీ స్ట‌యిల్ ను త‌ల‌పిస్తాయి. గురువును మించిన శిష్యుడిలా చెల‌రేగుతున్న అభిషేక్.. ఒక ఆకు ఎక్కువే చ‌దివాడు అన్న‌ట్లు ఆడుతుంటాడు.

By:  Tupaki Entertainment Desk   |   12 Dec 2025 3:00 AM IST
సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ లో యువ ఓపెన‌ర్ అభిషేక్...అత‌డి ఫోన్ తోనే భ‌యం
X

మైదానంలో భీక‌ర బౌల‌ర్ల‌నే షేక్ చేస్తున్న టీమ్ ఇండియా యువ‌ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌నే షేక్ చేస్తున్నాడు ఓ క్రికెట‌ర్. అల‌వోక‌గా సిక్స‌ర్లు బాదే అత‌డిని తేలిగ్గా తీసిపారేస్తాడ‌ట ఆ క్రికెట‌ర్. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతున్న అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌లో జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ లో జ‌ట్టుకు ప్ర‌ధాన ఆయుధంగా నిలుస్తాడ‌ని టీమ్ఇండియా ఆశ‌లు పెట్టుకుంది. ఇలాంటి స‌మ‌యంలో అత‌డి గురించి ఓ ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీమ్ ఇండియాలోకి రెండేళ్ల‌లోనే దూసుకొచ్చాడు అభిషేక్. ఆపై స‌న్ రైజ‌ర్స్ త‌ర‌ఫున దూకుడుగా ఆడుతూ తెలుగువారికి ద‌గ్గ‌ర‌య్యాడు. కాటేర‌మ్మ కొడుకుల‌లో ఒక‌డిగా మిగిలాడు. వ‌చ్చే 19వ సీజ‌న్ లో అత‌డు ఏ స్థాయిలో చెల‌రేగుతాడోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. దీనికిముందే టి20 ప్ర‌పంచ‌క‌ప్ కూడా జ‌ర‌గ‌నుంది. కాగా, అభిషేక్ పంజాబ్ కు చెందిన‌వాడు. టీమ్ ఇండియా టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ కూడా ఇదే రాష్ట్రంవాడు. వీరిద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. టి20ల్లో ఓపెనింగ్ చేస్తున్నారు. ఇద్ద‌రి విష‌యంలోనూ ఓ సామీప్య‌త ఉంది. అదే టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ వ‌ద్ద మెంటార్ షిప్. గిల్ సంగ‌తి ఏమోగాని.. త‌న‌లాగే లెఫ్ట్ హ్యాండ‌ర్ అయిన అభిషేక్ కు యువీ మార్గ‌నిర్దేశం చాలా ఉంది.

ఆ సిక్స‌ర్లు యువీ స్ట‌యిల్..

అభిషేక్ శ‌ర్మ కొట్టే సిక్స‌ర్లు అచ్చం యువీ స్ట‌యిల్ ను త‌ల‌పిస్తాయి. గురువును మించిన శిష్యుడిలా చెల‌రేగుతున్న అభిషేక్.. ఒక ఆకు ఎక్కువే చ‌దివాడు అన్న‌ట్లు ఆడుతుంటాడు. అయితే, ఇదంతా అత‌డి ఒక్క రోజు ప్ర‌య‌త్నం కాదు. ఆర్మీ ఆఫీస‌ర్ అయిన తండ్రి రాజ్ కుమార్ శ‌ర్మ క‌ఠోర శిక్ష‌ణ దీనివెనుక ఉంది. తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కే కుమారుడిని నిద్ర‌లేపి ప్రాక్టీస్ చేయించేవాడు ఆయన‌. జిమ్, ర‌న్నింగ్, స్విమ్మింగ్ ఇలా కుమారుడితో అన్నీ చేయించేవాడు. దీని ఫ‌లిత‌మే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన ప్రాక్టీస్ అల‌వాటైంది అభిషేక్ కు.

సొంత‌గ‌డ్డ‌పై...

గురువారం త‌న సొంత‌గ‌డ్డ చండీగ‌ఢ్ లో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడ‌బోతున్న అభిషేక్ ను చూసేందుకు యువీ రానున్నాడు. ఈ క్ర‌మంలో యువ ఓపెన‌ర్ లో భ‌యం మొద‌లైంద‌ట‌. అదేమంటే.. చిన్న త‌ప్పు చేసినా యువీ ఫోన్ చేసి అభిషేక్ ను దులిపేస్తాడ‌ట‌. కాగా, యువీ ట్రైనింగ్ లో అభిషేక్ మ‌రింత రాటుదేలాడు. మ‌రీ ముఖ్యంగా గోల్ఫ్ స్టిక్ తో స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేయించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రిప్పుడు యువీ చూస్తుండ‌గా పంజాబ్ కుర్రాడు అభిషేక్ ఎలా ఆడ‌తాడో చూడాలి..!