Begin typing your search above and press return to search.

గంభీర్ రిజైన్..? కోచింగ్ భ‌విత‌వ్యం బీసీసీఐ చేతిలో..

ఆస్ట్రేలియా టూర్ లో తొలి టెస్టు గెలిచి.. 3,4,5 టెస్టుల్లో ఓడింది. అప్పుడంటే సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు రాణించ‌లేద‌ని నిందించారు.

By:  Tupaki Entertainment Desk   |   26 Nov 2025 11:00 PM IST
గంభీర్ రిజైన్..? కోచింగ్ భ‌విత‌వ్యం బీసీసీఐ చేతిలో..
X

ఏడాది కాలంలోనే రెండు వైట్ వాష్ లు.. అదీ స్వ‌దేశంలో.. పైగా చ‌రిత్ర‌లో ఒక్క‌సారీ సిరీస్ కోల్పోని జట్టు చేతిలో.. మ‌ళ్లీ ఇప్పుడు 25 ఏళ్ల త‌ర్వాత సొంత గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ స్వీప్ ప‌రాభ‌వం..! ఇదీ గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచ్ గా వ‌చ్చాక టీమ్ ఇండియా టెస్టు ప్ర‌ద‌ర్శ‌న‌. నిరుడు జూలైలో గంభీర్ కోచ్ కావ‌డం.. ఆ వెంట‌నే జ‌రిగిన‌ శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది. 27 ఏళ్ల త‌ర్వాత లంక చేతిలో సిరీస్ ప‌రాజ‌యం ఎదురైంది. బంగ్లాదేశ్ పై టెస్టు సిరీస్ గెలిచినా అది బ‌ల‌హీన జ‌ట్టు.. త‌ర్వాత నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. న్యూజిలాండ్ చేతిలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 0-3తో టెస్టు సిరీస్ చేజార్చుకుంది. ఆపే ఆస్ట్రేలియా టూర్ లో 1-3తో ఓట‌మి.. మొన్న‌టి ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో 2-2తో డ్రా.. అస‌లు పోటీనే కాని వెస్టిండీస్ పై 2-0తో విజ‌యం సాధించినా.. ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా మీద 0-2తో ఓట‌మి..! దీంతోనే గంభీర్ మీద తీవ్ర స్థాయి విమ‌ర్శ‌లు రాసాగాయి. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టులో అత‌డు చేసిన ప్ర‌యోగాలు బెడిసికొట్టాయి. సాయి సుద‌ర్శ‌న్, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ వంటి స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్ల‌ను కాద‌ని.. న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలో దిగి.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను వ‌న్ డౌన్ లో పంప‌డం అంద‌రినీ విస్తుపోయేలా చేసింది. అదే టెస్టులో కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ మెడ ప‌ట్టేయ‌డం మ‌రింత క‌ష్టాలు తెచ్చింది. చివ‌ర‌కు 15 ఏళ్ల త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా భార‌త్ లో టెస్టు నెగ్గే అవ‌కాశం ఇచ్చింది.

ఇన్ని ప‌రాభ‌వాలా?

ఆస్ట్రేలియా టూర్ లో తొలి టెస్టు గెలిచి.. 3,4,5 టెస్టుల్లో ఓడింది. అప్పుడంటే సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు రాణించ‌లేద‌ని నిందించారు. వారిని బ‌లవంతంగా రిటైర‌య్యేలా చేశారు కూడా. దీనివెనుక గంభీర్ పాత్ర ఉంద‌ని ఇప్ప‌టికీ అంటుంటారు. స‌రే, వారు లేకుండా ఇంగ్లండ్ వెళ్లి మెరుగైన ఫ‌లితం సాధించించిది. కానీ, స్వ‌దేశంలో మాత్రం చేతులెత్తేస్తోంది. రోహిత్, కోహ్లి, పుజార‌, ర‌హానే స్థాయిలో స్పిన్ ను ఎదుర్కొనే బ్యాట్స్ మెన్ లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. దేశ‌వాళీల్లో రాణిస్తున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను తీసుకోక‌పోవ‌డం జ‌ట్టులో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మార్పులు చేయ‌డం గంభీర్ పై విమ‌ర్శ‌ల‌ను పెంచుతున్నాయి.

ఇంకేం చేస్తాడు..?

టీమ్ ఇండియా గ‌త ఏడాదిలో స్వ‌దేశంలో 5 టెస్టులు ఓడింది. ఒక‌ప్పుడైతే ఇవ‌న్నీ గెలిచేవే. ఇప్ప‌డు గంభీర్ కోచింగ్ లో ప‌రిస్థితి తారుమారైంది. దీంతోనే అత‌డు ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌న ప‌ద‌వి విష‌య‌మై బీసీసీఐనే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపాడు. ఏది ఏమైనా దేశ‌మే ముఖ్యం అని , వ్య‌క్తులు కాద‌ని స్ప‌ష్టం చేశాడు. మ‌రోవైపు చాంపియ‌న్స్ ట్రోఫీ, ఆసియా క‌ప్ విజ‌యాల‌ను గుర్తు చేశాడు. అంటే.. గంభీర్ టెస్టు కోచింగ్ ను వ‌దులుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. దాదాపు ఇంకో రెండేళ్లు ప‌ద‌వీ కాలం ఉండ‌గా.. గంభీర్ ను త‌ప్పిస్తారా? అన్న‌ది చ‌ర్చ‌నీయం. అంతేగాక.. భార‌త క్రికెట్ లో టెస్టుల‌కు, ప‌రిమిత ఓవ‌ర్లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు కానీ.. కోచింగ్ లో మాత్రం అలా లేదు. దీంతోనే గంభీర్ తో రిజైన్ చేయిస్తారు త‌ప్పితే అత‌డిని ఏదో ఒక ఫార్మాట్ కు కోచ్ గా ఉంచడం జ‌ర‌గ‌దు. లేదంటే మ‌రొక ఏడాది అవ‌కాశం ఇస్తారు. బ‌హుశా ఇప్ప‌ట్లో టెస్టు సిరీస్ లు కూడా లేనందున గంభీర్ ను త‌ప్పించినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?