వన్డే వండర్.. 50 ఓవర్లు స్పిన్నర్లతో.. మొత్తం 93 ఓవర్లు వారే
ఇటీవల భారత్ లో పర్యటించి రెండు టెస్టులు ఆడి క్లీన్ స్వీప్ నకు గురైంది. ఇటు నుంచి బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ వన్డేలు ఆడుతోంది.
By: Tupaki Entertainment Desk | 22 Oct 2025 9:02 AM ISTఒకప్పుడు వండర్ జట్టుగా పేరొందింది.. అరివీర భయంకర పేసర్ల జట్టుగా ప్రపంచాన్ని వణికించింది.. బ్యాటింగ్ లో ఆ జట్టు ఆటగాళ్లు బరిలో దిగుతుంటే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తేవారు.. వారి పేసర్లు బంతి అందుకుంటే బ్యాటర్ల గుండెలు దడదడలాడేవి. అలాంటి జట్టు ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. తొలి రెండు ప్రపంచ కప్ లు అలవోకగా గెలిచినా... 50 ఏళ్లుగా మళ్లీ చాంపియన్ కాలేకపోయింది. రెండేళ్ల కిందట భారత్ లో జరిగిన టోర్నీకి అసలు అర్హతే సాధించలేకపోయింది.
ఆ జట్టేదో తెలిసిందా..?
పైన చెప్పుకొన్న గొప్ప అంతా ఒక జట్టు గురించి. అదే వెస్టిండీస్. 1995కు ముందు టెస్టుల్లో, వన్డేల్లో మేటి టీమ్ గా పేరున్న విండీస్ క్రమంగా ప్రాభవం కోల్పోయింది. చివరకు పసికూనల చేతిలోనూ ఓడే స్థితికి వచ్చింది. ఇటీవల భారత్ లో పర్యటించి రెండు టెస్టులు ఆడి క్లీన్ స్వీప్ నకు గురైంది. ఇటు నుంచి బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ వన్డేలు ఆడుతోంది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్ లో ఓ రికార్డును నెలకొల్పింది.
ఉపఖండంలో ఎలా ఆడాలో...
భారత ఉపఖండంలో స్పిన్నర్లే విన్నర్లు. మొన్నటి టెస్టు సిరీస్ లో భారత్ చేతిలో ఓడిపోయాక ఈ విషయం మళ్లీ మరింత బాగా తెలిసిందేమో..? ఆ మేరకు మంగళవారం బంగ్లాదేశ్ తో వన్డేలో మొత్తం ఓవర్లన్నీ స్పిన్నర్లతో వేయించాడు వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్.
-అఖిల్ హొసేన్, క్యారీ పియరీ, రోస్టన్ చేజ్, గుడకేష్ మోటీ, అలీఖ్ అథనేజ్(పార్ట్ టైమర్).. తలా 10 ఓవర్లు వేశారు. జట్టులో గ్రీన్స్ ఒక్కడే పేస్ బౌలర్. కానీ, అతడికి కెప్టెన్ హోప్ బౌలింగ్ ఇవ్వలేదు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇలా ఒక జట్టు మొత్తం ఓవర్లు స్పిన్నర్లతో వేయించడం మొదటిసారి.
-మ్యాచ్ లో 50 ఓవర్లు ఆడిన బంగ్లా ఏడు వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. 214 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన విండీస్ 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్ లో పైచేయి..
ఇక వన్డేల్లో ఇటీవలి కాలంలో టై కావడం అరుదుగా మారింది. బంగ్లా-విండీస్ మ్యాచ్ లో అదే జరగడంతో టి20ల తరహాలో సూపర్ ఓవర్ ఆడించారు. ఇందులో వెస్టిండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేయగా.. బంగ్లా వికెట్ నష్టానికి 9 పరుగులే చేయగలిగింది. దీంతో వెస్టిండీస్ గెలిచింది.
కొసమెరుపు: ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తరఫున 42 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (ఎడమచేతి వాటం పేసర్) మాత్రమే 8 ఓవర్లు వేశాడు. బంగ్లా సూపర్ ఓవర్ కూడా ఇతడే బౌల్ చేశాడు. విండీస్ సూపర్ ఓవర్ ను అఖీల్ హొసేన్ వేయడం.
