మెస్సీ గోట్ టూర్... బెంగాల్ క్రీడల మంత్రి బలి...
కోల్ కతా ఘటనకు మెస్సీ పరోక్ష కారణం అయితే.. ఇప్పుడు శిక్ష బెంగాల్ మంత్రికా అన్నట్లయింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ పదవికి రాజీనామా చేశారు.
By: Tupaki Political Desk | 16 Dec 2025 4:49 PM ISTప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా దేశానికి చెందిన లయోనల్ మెస్సీ భారత టూర్.. ఓ రాష్ట్ర మంత్రి పదవి పోయేందుకు కారణమైంది. ఓ ప్రయివేటు ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీయడంతో పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్ పదవికి రాజీనామా చేశారు. గత శనివారం కోల్ కతా లోని సాల్ట్ లేక స్టేడియంలో మెస్సీ ప్రోగ్రాం ఏర్పాటుచేశారు. అయితే, రెండు గంటలు సాగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22 నిమిషాలకే ముగించేయడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కుర్చీల ధ్వంసం, వాటర్ బాటిళ్లు విసిరేయడంతో వారు విధ్వంసం రేపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం దీనిపట్ల అసహనం వ్యక్తం చేశారు. అయితే, అదే రోజు మెస్సీ హైదరాబాద్ లో టూర్ చేశాడు. ఇక్కడ కార్యక్రమం విజయవంతమైంది. ఇక ఆదివారం ముంబైలో, సోమవారం ఢిల్లీలో మెస్సీ ప్రోగ్రాం సజావుగా సాగింది. కోల్ కతా లో మాత్రమే అనూహ్యంగా ఇబ్బందులు తలెత్తాయి.
తప్పు మెస్సీది.. శిక్ష మంత్రికి
కోల్ కతా ఘటనకు మెస్సీ పరోక్ష కారణం అయితే.. ఇప్పుడు శిక్ష బెంగాల్ మంత్రికా అన్నట్లయింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ పదవికి రాజీనామా చేశారు. కోల్ కతా ఘటనపై తనమీద విమర్శలు వస్తుండడంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సాల్ట్ లేక్ స్టేడియం ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తా సహా ఐదుగురిని అరెస్టు చేశారు. మరోవైపు శతద్రుకు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు.
మమతా ఆమోదమే మిగిలింది..
అరూప్ బిశ్వాస్ రాజీనామాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమోదం తెలుపుతారా? అన్నది చూడాలి. తన లేఖను బిశ్వాస్ సీఎం మమతాకు పంపారు. స్టేడియం ఘటనపై దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్లు బిశ్వాస్ చెప్పారు.
కాగా, మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియంలో కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నందుకు కారణం అతడిని చుట్టుముట్టిన వీఐపీల్లో ఒకరి పెన్ను తగలడమేననే కారణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెస్సీ భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని అతడి సహాయకులు భావించారని.. దీంతో అతడు వెంటనే వెళ్లిపోయాడని పేర్కొంటున్నారు. కానీ, కోల్ కతాలో మెస్సీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదని, అతడిదే తప్పు అని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించాడు. ఇక తన క్యాబినెట్ మంత్రి రాజీనామాను మమతా బెనర్జీ ఆమోదించే అవకాశాలు లేవని కూడా అంటున్నారు.
