Begin typing your search above and press return to search.

అదిరిందయ్యా సుందర్... ఆసిస్ పై భారత్ ఘన విజయం!

ఆసీస్‌ తో ఐదు టీ20ల సిరీస్‌ లో భారత్ 0-1 తేడాతో వెనుకబడిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   2 Nov 2025 5:37 PM IST
అదిరిందయ్యా సుందర్... ఆసిస్  పై భారత్  ఘన విజయం!
X

ఆసీస్‌ తో ఐదు టీ20ల సిరీస్‌ లో భారత్ 0-1 తేడాతో వెనుకబడిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. సిరీస్‌ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఆసిస్ బౌలర్ లను ఊచకోత కోశాడు.

అవును... ఆసిస్ తో ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (74), స్టాయినిస్‌ (64) అర్ధశతకాలతో రాణించారు. భారత్‌ బౌలర్లలో అర్ష్‌ దీప్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా దూకుడుగా ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ మొదటి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌ లు, రెండు ఫోర్లతో విరుచుకు పడ్డాడు. అయితే అభిషేక్‌ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ ల సాయంతో 25) నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌ మన్‌ గిల్‌ (15) ఎల్లిస్‌ బౌలింగ్‌ లోనే ఔటయ్యాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (24) స్టాయినిస్‌ బౌలింగ్‌ లో నాథన్‌ ఎల్లిస్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తిలక్‌ వర్మ (29).. జేవియర్‌ బ్రేట్‌ లెట్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ (17) సైతం తక్కువ స్కోర్‌ కే వెనుదిరిగాడు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ (49*) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, భారత్ కు సూపర్ విక్టరీని అందించాడు. జితేశ్ శర్మ (22) భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఫలితంగా... 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి దాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌ ల సాయంతో 49 పరుగులతో నాటౌట్) రాణించాడు. ఆసిస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు చేసిన 49 పరుగుల్లోనూ 36 పరుగులు బౌండరీలతోనే రావడం గమనార్హం.