ఐపీఎల్-పీఎస్ఎల్ మధ్య తేడా అదే.. వార్నర్ సంచలన వ్యాఖ్యలు.. షాక్ కు గురైన ప్రపంచ క్రికెట్..
డేవిడ్ వార్నర్ వంటి గ్లోబల్ స్టార్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) పట్ల తన అసంతృప్తిని బాహాటంగా వెల్లడించడం క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద దుమారాన్ని రేపింది.
By: Tupaki Political Desk | 28 April 2026 9:00 PM ISTడేవిడ్ వార్నర్ వంటి గ్లోబల్ స్టార్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) పట్ల తన అసంతృప్తిని బాహాటంగా వెల్లడించడం క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద దుమారాన్ని రేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ (IPL) వంటి టాప్ లీగ్స్‌లో ఆడిన అనుభవం ఉన్న వార్నర్, పీఎస్ఎల్ నిర్వహణ లోపాలను ఎత్తిచూపడం ఆ లీగ్ ప్రతిష్టకు గట్టి దెబ్బే అని చెప్పాలి. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంటే క్రికెట్ ప్రపంచంలో ఒక బ్రాండ్. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్న వార్నర్, తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో తన చేదు అనుభవాలను పంచుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఆటగానే కాకుండా, మైదానం బయట నిర్వాహకుల తీరు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో అడిగే ప్రశ్నలు తనను మానసికంగా అలసిపోయేలా చేశాయని చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.
వార్నర్ ఆవేదనకు కారణాలు
వార్నర్ తన విమర్శల్లో కీలకమైన, విడ్డూరమైన అంశాలను ప్రస్తావించారు. జెర్సీ రంగు బంతికి అంటుకోవడం వంటి చిన్నపాటి సాంకేతిక లోపాలు ఒక అంతర్జాతీయ స్థాయి లీగ్‌లో జరగడం ఆశ్చర్యకరం. ఇది లీగ్ క్వాలిటీ స్టాండర్డ్స్‌ను ప్రశ్నిస్తోందని వార్నర్ అన్నాడు. మ్యాచ్ సమయాల్లో అనిశ్చితి, ప్రయాణ ఏర్పాట్లు, మైదానంలో వసతులపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆటగాళ్లు ఎప్పుడూ క్రమశిక్షణతో కూడిన షెడ్యూల్ కోరుకుంటారు, అది లోపించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదంటే ఇతర విభాగాల్లో ఇచ్చే బహుమతులు (ఉదాహరణకు తక్కువ విలువైన వస్తువులు లేదా వింతైన బహుమతులు) ఒక ప్రొఫెషనల్ లీగ్ స్థాయికి దిగజారుస్తున్నాయని వార్నర్ భావించారు.
IPL-PSL మధ్య పోలిక
వార్నర్ పరోక్షంగా పీఎస్ఎల్‌ను ఇతర లీగ్స్‌తో (ముఖ్యంగా ఐపీఎల్) పోల్చడం పాక్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లు పీఎస్ఎల్‌లో ఉన్నారని ఆ లీగ్ గర్వంగా చెప్పుకుంటుంది. అయితే, కేవలం ఆట ఒక్కటే సరిపోదని, లీగ్ విజయవంతం కావాలంటే పటిష్టమైన నిర్వహణ, బ్రాండ్ వాల్యూ, ఆటగాళ్ల గౌరవం ముఖ్యమని వార్నర్ చెప్పుకువచ్చారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఇప్పుడు వ్యాపారంతో ముడిపడి ఉంది. ఒక అగ్రశ్రేణి ఆటగాడు ఒక లీగ్ గురించి ప్రతికూలంగా మాట్లాడితే, భవిష్యత్తులో ఇతర దేశాల ఆటగాళ్లు ఆ లీగ్‌లో ఆడేందుకు వెనుకాడతారు. వార్నర్ వ్యాఖ్యలు పీఎస్ఎల్ నిర్వాహకులకు హెచ్చరిక వంటివి.
ప్రెస్ కాన్ఫరెన్స్ వేధింపులు..
క్రికెట్ గురించి మాత్రమే కాకుండా వార్నర్ దానికి అను సంధానంగా జరుగిన విషయాలను కూడా పంచుకున్నారు. అక్కడ ఉన్న రిపోర్టర్లు ఇతర లీగ్స్‌తో పోలుస్తూ ప్రశ్నలు అడగడం ఆటగాళ్లను ఇబ్బంది పెడుతుందని వార్నర్ చెప్పడం సమంజసమే. ఇది మీడియా బాధ్యతారాహిత్యాన్ని కూడా సూచిస్తోంది.
ప్రతి లీగ్‌కు తనదైన సవాళ్లు ఉంటాయి, కానీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించకపోతే అవి ఎక్కువ కాలం నిలబడలేవు. వార్నర్ చేసిన విమర్శలు పీఎస్ఎల్ మెరుగుపడేందుకు ఒక అవకాశంగా తీసుకోవాలి తప్ప, వ్యక్తి గత విమర్శగా చూడద్దు... ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు నాణ్యమైన ఆటతో పాటు నాణ్యమైన నిర్వహణను ఆశిస్తున్నారు. వార్నర్ నిక్కచ్చిగా చెప్పిన ఈ విషయాలు భవిష్యత్తులో ఫ్రాంచైజీ క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆశిద్దాం.
