సింహాద్రి అప్పన్న దయ చూపించాడు !
టీమిండియా జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని వ్యక్తం చేసిన అక్షర భావమిది.
By: Satya P | 8 Dec 2025 12:38 AM ISTటీమిండియా జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని వ్యక్తం చేసిన అక్షర భావమిది. ఆయన దేవస్థానం పుస్తకంలో ఈ మేరకు రాసి మరీ తన భక్తిని ఆ దేవ దేవుడి మీద చాటుకున్నారు. దేవస్థానం వారు అందించిన పుస్తకమలో విరాట్ కోహ్లీ తన భక్తిని చాటుకుంటూ అప్పన్న అనుగ్రహించాడు అని ఆయన ఇంగ్లీష్ లో రాసి అక్షర నీరాజనాలు అర్పించారు. ఆదివారం సింహాచలం లోని సుప్రసిద్ధమైన అప్పన్న ఆలయానికి వచ్చిన విరాట్ కోహ్లీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అప్పన్న ఆశీస్సులు అంటూ :
సింహాచలం నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నాను ఒక దివ్యమైన అనుభూతిని ఈ దర్శనం కలిగించింది. స్వామి వారి ఆశీస్సులు మాపైన ఉన్నాయి. అంటూ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని పుస్తకంలో రాయడంతో అప్పన్న భక్తులు అంతా హర్షామోదాలు తెలియచేస్తున్నారు. విరాట్ కోహ్లీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. ఆయన వెంట వచ్చిన భారత జట్టు సభ్యులకు దర్శనం ఏర్పాట్లు అధికారులు చేయించారు. విరాట్ కోహ్లీ తదితరులు అంతా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇక కోహ్లీ కుటుంబం తరఫున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎగబడిన అభిమానం :
అప్పన్న ఆలయానికి విరాట్ కోహ్లీ వచ్చారని తెలుసుకుని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అనేక మంది కోహ్లీతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరచారు. కోహ్లీ కూడా ఏ మాత్రం విసుగు చెందకుండా అడిగిన వారికి సెల్ఫీలు ఇచ్చారు. భక్తి పూర్వకంగా ఆయన ఆలయం పరిసరాలను చూస్తూ అధికారులను స్వామికి సంబంధించిన విషయాలను అన్నీ అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజుల ముందు :
ఇక విశాఖలో శనివారం జరిగిన దక్షిణాఫ్రికా భారత్ జట్టు వన్ డే మ్యాచ్ లో భారత్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీనికి ఒక రోజు ముందు భారత జట్టు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ అప్పన్న ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన ఎంతో మహిమ కలిగిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక విజయం సాధించాక విరాట్ కోహ్లీ రావడం విశేషం. దీంతో అప్పన్నకు చేసిన పూజలు మొక్కులు ఫలించాయని క్రికెట్ అభిమానులు కూడా చెబుతున్నారు. భారత్ జట్టు ఇదే తీరున మరిన్ని విజయాలను సాధించాలని అంతా కోరుకుంటున్నారు.
