Begin typing your search above and press return to search.

కోహ్లీ శివ తత్వం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త టాటూ అర్థం తెలుసా?

ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు.. క్రికెట్ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల హోరుతో పాటు గ్లామర్, స్టైల్ స్టేట్‌మెంట్‌లకు కొదవ ఉండదు.

By:  A.N.Kumar   |   27 March 2026 12:09 PM IST
కోహ్లీ  శివ తత్వం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న  కొత్త టాటూ అర్థం తెలుసా?
X

ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు.. క్రికెట్ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల హోరుతో పాటు గ్లామర్, స్టైల్ స్టేట్‌మెంట్‌లకు కొదవ ఉండదు. అయితే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తోనే కాదు.. తన శరీరంపై కొత్తగా చేరిన ఒక కళాఖండంతో వార్తల్లో నిలిచారు. కోహ్లీ తన ఎడమ చేతిపై వేయించుకున్న కొత్త 'ఫుల్ స్లీవ్' టాటూ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, కోహ్లీలోని మారుతున్న వ్యక్తిత్వానికి.. ఆయనలోని ఆధ్యాత్మిక కోణానికి అద్దం పడుతోంది.

పాత హంగులకు.. కొత్త మెరుగులు

విరాట్ కోహ్లీకి టాటూలంటే ప్రాణం అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన శరీరంపై తల్లిదండ్రుల పేర్లు, టెస్ట్ క్యాప్ నంబర్, గాడ్స్ ఐ వంటి 11 కంటే ఎక్కువ టాటూలు ఉన్నాయి. అయితే తాజాగా ఆయన తన ఎడమ చేతిపై ఉన్న పాత టాటూలను రీడిజైన్ చేయించుకున్నారు. పాత డిజైన్లను పూర్తిగా తొలగించకుండా, వాటిని ఒకే గొలుసుకట్టుగా ఆధ్యాత్మిక భావజాలంతో కలిపి ఒక 'కంప్లీట్ స్లీవ్ ఆర్ట్'గా మార్చడం విశేషం. ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి ఆధ్వర్యంలో సుమారు 13 గంటల పాటు శ్రమించి ఈ అద్భుతమైన డిజైన్‌ను రూపొందించారు.

శివ తత్వం.. ఆధ్యాత్మిక సంకేతాలు

ఈ కొత్త టాటూలో ప్రధానంగా శివ తత్వాన్ని ప్రతిబింబించే అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో పవిత్రమైన ఓం చిహ్నం, శక్తికి ప్రతీక అయిన త్రిశూలం, విశ్వాంతరాళాన్ని సూచించే మండల ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది జీవితంలో సమతుల్యత, పూర్ణత్వం, అంతర్గత శాంతిని సూచిస్తుంది. టాటూలో ఉపయోగించిన సూక్ష్మమైన చుక్కల పనితనం ఆత్మపరిశీలనను.. అనంతమైన శక్తిని చాటిచెబుతోంది. కోహ్లీ కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా తన జీవితంలో వస్తున్న మార్పులను ఈ టాటూ ద్వారా వ్యక్తపరిచారు. మైదానంలో దూకుడుగా కనిపించే కోహ్లీ నిజజీవితంలో ఎంతటి ప్రశాంతతను, క్రమశిక్షణను కోరుకుంటారో ఈ డిజైన్ స్పష్టం చేస్తోంది.

మారుతున్న విరాట్ ఆలోచనా విధానం

గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ప్రవర్తనలో జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కేవలం అగ్రెసివ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతున్నారు. భార్య అనుష్క శర్మతో కలిసి ఉత్తరాఖండ్‌లోని కైచీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించడం.. బృందావనంలో నిమ్ కరోలి బాబా ఆశీస్సులు తీసుకోవడం.. మహాకాళేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం వంటివి ఆయనలో వస్తున్న పరిణతికి నిదర్శనాలు. "ఈ టాటూ కేవలం చర్మంపై వేసిన రంగు కాదు.. ఇది ఒక ప్రయాణం. తనలోని పాత కోహ్లీకి.. కొత్తగా పరిణామం చెందిన ఆధ్యాత్మిక కోహ్లీకి మధ్య ఉన్న వారధి ఇది" అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ట్రెండ్ సెట్టర్‌గా కోహ్లీ..

కోహ్లీ ఏది చేసినా అది ఒక ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం యువత ఈ 'శివ తత్వ' టాటూ డిజైన్ పట్ల విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు లేదా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫుల్ స్లీవ్ టాటూ కెమెరా కంటికి చిక్కి అభిమానులను కట్టిపడేస్తోంది.

మొత్తానికి ఐపీఎల్ రికార్డుల వేటలో ఉన్న విరాట్ కోహ్లీ.. తన కొత్త టాటూ ద్వారా స్టైల్, భక్తి, జీవన తత్వాన్ని మేళవించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ అనే ఒక గొప్ప క్రీడాకారుడి ఆత్మవికాసానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు సజీవ సాక్ష్యం.