Begin typing your search above and press return to search.

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌తో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంపద సుమారు రూ.1,600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ పారితోషికం, బీసీసీఐ కాంట్రాక్ట్, అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నారు. వీటితో పాటు ఫిట్‌నెస్, రెస్టారెంట్లు, దుస్తుల బ్రాండ్లు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. 38వ ఏట అడుగుపెడుతున్న కోహ్లీ ప్రయాణం క్రీడా విజయాలతో పాటు ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

By:  A.N.Kumar   |   5 Nov 2026 3:40 PM IST
వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది
X

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పేరు ఒక సంచలనం. మైదానంలో దిగితే చాలు.. తన ఆవేశపూరితమైన ఆటతీరుతో.. శతకాల పరంపరతో పరుగుల వర్షం కురిపించే ఈ రారాజు సంపాదనలోనూ అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో సాధారణ కలలతో కెరీర్ ప్రారంభించి భారత జట్టులో చోటే లక్ష్యంగా అడుగుపెట్టిన ఈ స్టార్ క్రికెటర్.. నేడు ప్రపంచంలోనే అధిక సంపద కలిగిన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కేవలం బ్యాట్‌తో సాధించిన విజయాలు మాత్రమే కాకుండా అసాధారణమైన బ్రాండ్ వ్యాల్యూ వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులు... సోషల్ మీడియా ప్రభావంతో సుమారు రూ. 1,600 కోట్ల భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

విరాట్ కోహ్లీకి క్రికెట్ రూపంలో వస్తున్న ఆదాయం ఎంతో ఎక్కువ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న ఆయనకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 21 కోట్ల పారితోషికం లభిస్తోంది. దీనికి తోడు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చే ఏ-ప్లస్ (A+) గ్రేడ్ వార్షిక కాంట్రాక్టు ద్వారా రూ. 3 కోట్లతో పాటు ప్రతి మ్యాచ్ ఫీజులు..ఇతర క్రీడా సంబంధిత ప్రోత్సాహకాలు విడివిడిగా అందుతున్నాయి. అయితే ఇది ఆయన నిర్మించిన సంపద కొండలో ఒక భాగం మాత్రమే.

డిజిటల్ ప్రపంచంలో విరాట్ కోహ్లీకున్న క్రేజ్.. గ్లోబల్ రీచ్ అసాధారణమైనవి. సోషల్ మీడియాలో కోట్ల సంఖ్యలో ఉన్న ఆయన అభిమానుల నెట్‌వర్క్ అంతర్జాతీయ బ్రాండ్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసే ఒక్క ప్రమోషనల్ , స్పాన్సర్డ్ పోస్ట్ విలువ కోట్లలో ఉంటుంది. మైదానంలో ఆయన నిలబెట్టుకున్న విశ్వసనీయత.. ఫిట్‌నెస్ క్రమశిక్షణ.. యువతపై ఆయనకున్న ప్రభావం వల్ల ప్రతి ప్రముఖ కంపెనీ తమ ఉత్పత్తులకు విరాట్‌నే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.

కోహ్లీ విజయ రహస్యం కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. తన ఇష్టాఇష్టాలను, ఫిట్‌నెస్ పట్ల ఉన్న శ్రద్ధను వ్యాపార అవకాశాలుగా మలుచుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. స్వయంగా ఫిట్‌నెస్ ఐకాన్ అయిన కోహ్లీ, జిమ్‌లు, ఫిట్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రీమియం రెస్టారెంట్లు , డైనింగ్ నెట్‌వర్క్‌లను నెలకొల్పారు. స్వంత దుస్తుల బ్రాండ్లు , వివిధ క్రీడా ఫ్రాంచైజీలు, స్టార్టప్‌లలో భాగస్వామిగా మారి వ్యాపారాల్లో ముందంజలో ఉన్నారు.

ఈ రోజు 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న విరాట్ కోహ్లీ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదని.. దానికి నిరంతర సాధన, క్రమశిక్షణ, కఠినమైన శ్రమ, లభించిన అవకాశాలను సరైన రీతిలో ఆర్థికంగా మార్చుకునే వ్యూహాత్మక ఆలోచన తోడైతే ఎంతటి ఎత్తులైనా ఎదుగొచ్చని ఆయన నిరూపించారు.

క్రికెట్ మైదానంలో సెంచరీల రికార్డులను తిరగరాసిన కోహ్లీ ఆర్థిక రంగాన కూడా రూ. 1,600 కోట్ల సంపాదనతో తన బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేశారు.