Begin typing your search above and press return to search.

వ‌న్డేల‌కూ రిటైర్మెంట్.. ఆర్సీబీతో క‌టీఫ్‌.. కోహ్లి పోస్టు వైర‌ల్

కంగారూ గ‌డ్డ‌పై అడుగుపెడుతూనే విరాట్ కోహ్లి సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.. త‌న అంత‌ర్జాతీయ‌ కెరీర్ పై వ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించాడు..

By:  Tupaki Entertainment Desk   |   16 Oct 2025 12:49 PM IST
వ‌న్డేల‌కూ రిటైర్మెంట్.. ఆర్సీబీతో క‌టీఫ్‌.. కోహ్లి పోస్టు వైర‌ల్
X

కంగారూ గ‌డ్డ‌పై అడుగుపెడుతూనే విరాట్ కోహ్లి సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.. త‌న అంత‌ర్జాతీయ‌ కెరీర్ పై వ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించాడు.. త‌న ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కో తేల్చిచెప్పాడు.. నిరుడు టి20ల‌కు, ఈ ఏడాది టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన స్టార్ క్రికెట‌ర్ ను వ‌చ్చే ఏడాది వ‌న్డేల‌కూ త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందా..? అనే అనుమానాలు ముసురుతున్న వేళ వాట‌న్నిటికీ తెర‌దించాడు. ఈ ఆదివారం నుంచి మొద‌లుకానున్న ఆస్ట్రేలియా వ‌న్డే సిరీస్ ముంగిట కోహ్లి పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

విఫ‌ల‌మైతే వేటు...?

ఆస్ట్రేలియాతో సిరీస్ విరాట్ కోహ్లీ తాడోపేడో...! దీంట్లో విఫ‌ల‌మైతే కోహ్లి వ‌న్డే కెరీర్ కూ ముగింపు మొద‌లైన‌ట్లే..! దీనికిత‌గ్గ‌ట్లే, ఇటీవ‌ల హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయం అయ్యాయి. కోహ్లితో పాటు కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన‌ రోహిత్ భ‌విత‌వ్యంపైనా అనుమానాలు నెల‌కొన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆస్ట్రేలియా నుంచి కోహ్లి చేసిన ట్వీట్ స‌మాధానంగా నిలిచింది.

చేతులెత్తేయ‌ను.. పోరాడ‌తా

కోహ్లి పోరాట యోధుడు అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అలాంటివాడు ప్ర‌స్తుతం జ‌ట్టులో చోటుకు అర్హుడేనా అన్న ప్ర‌శ్న రావ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశా ఇవ‌న్నీ త‌న ప‌రిశీల‌న‌కూ వ‌చ్చాయేమో..? త‌న ట్వీట్ లో వాటికి బ‌దులు చెప్పాడు. మ‌నం చేతులెత్తేసిన‌ప్పుడే మ‌న‌కు ఓట‌మి అని పోస్ట పెట్టాడు. అంటే, మ‌రికొంత కాలం అంత‌ర్జాతీయ క్రికెట్ లో కొన‌సాగుతాన‌ని అర్థం అన్న‌మాట‌. త‌న టార్గెట్ 2027 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ అని కూడా స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్సీబీ తో ఉంటాడా?

కోహ్లీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్ 2008లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)తో మొద‌లైంది. ఇన్నేళ్ల‌లో అత‌డు ఎప్పుడూ ఫ్రాంచైజీ మార‌తాడ‌నే ఆలోచ‌న రాలేదు. ఈ ఏడాది చాంపియ‌న్ గా నిల‌వ‌డంతో ఆ జ‌ట్టు ల‌క్ష్యం కూడా నెర‌వేరింది. అయితే, ఇటీవ‌ల కోహ్లి... ఆర్సీబీతో కాంట్రాక్టు ర‌ద్దు చేసుకున్న‌ట్లు ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే సీజ‌న్ కు అత‌డు ఫ్రాంచైజీ మార‌డం ఖాయం అన్న‌ట్లుగా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. వాస్త‌వం మాత్రం వేరే ఉంది.

అది క‌మ‌ర్షియల్ యాడ్ డీల్..

కోహ్లీ ఆర్సీబీతో ర‌ద్దు చేసుకున్న‌ది క‌మ‌ర్షియ‌ల్ డీల్. పూర్తిగా క్రికెట్ కు సంబంధం లేనిది. వాణిజ్య వ్య‌వ‌హారాల ప్ర‌మోష‌న్స్ కు సంబంధించిన అంశంపై కోహ్లి ఆలోచ‌న మార‌డంతోనే ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది.