Begin typing your search above and press return to search.

కోహ్లి డ‌బుల్ హ్యాట్రిక్ సెంచ‌రీ..! విశాఖ వ‌న్డే టికెట్లు హాట్ కేక్

వ‌న్డే క్రికెట్ లో ఇప్ప‌టివ‌ర‌కు పదమూడు బ్యాట్స్ మెన్ మాత్ర‌మే హ్యాట్రిక్ సెంచ‌రీలు చేశారు. కానీ, మొట్ట‌మొద‌ట ఈ రికార్డు అందుకున్న భార‌తీయుడు ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Entertainment Desk   |   5 Dec 2025 1:02 PM IST
కోహ్లి డ‌బుల్ హ్యాట్రిక్ సెంచ‌రీ..! విశాఖ వ‌న్డే టికెట్లు హాట్ కేక్
X

వ‌న్డే క్రికెట్ లో ఇప్ప‌టివ‌ర‌కు పదమూడు బ్యాట్స్ మెన్ మాత్ర‌మే హ్యాట్రిక్ సెంచ‌రీలు చేశారు. కానీ, మొట్ట‌మొద‌ట ఈ రికార్డు అందుకున్న భార‌తీయుడు ఎవ‌రో తెలుసా? ఇంకెవరు..?? ర‌న్ మెషిన్ నుంచి ట‌న్ మెషిన్ గా ఎదిగిన విరాట్ కోహ్లి. 2018లో అత‌డు హ్యాట్రిక్ సెంచ‌రీలు కొట్టాడు. ఆ త‌ర్వాత ఈ రికార్డును రోహిత్ శ‌ర్మ కూడా సాధించాడు. ఇక ఒకే సిరీస్ లో హ్యాట్రిక్ సెంచ‌రీలు చేసిన‌వారు పాక్ కు చెందిన జ‌హీర్ అబ్బాస్, ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ (ఇండియాపై), విరాట్ కోహ్లి (వెస్టిండీస్ పై) మాత్ర‌మే. ఇప్పుడు ఈ రికార్డును మ‌రోసారి సాధించే, మ‌రో ప్ర‌త్య‌ర్థి (ద‌క్షిణాఫ్రికాపై) సాధించే అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు విరాట్. అంతేకాదు.. చ‌రిత్ర‌లో మ‌రే బ్యాట‌ర్ కు సాధ్యం కాని రీతిలో వ‌న్డేల్లో డ‌బుల్ హ్యాట్రిక్ సెంచ‌రీలు చేసిన ఏకైక క్రికెట‌ర్ గానూ నిలిచే అవ‌కాశం అత‌డి ముందు ఉంది. దీనికి వేదిక మ‌న విశాఖప‌ట్నం కానుండ‌డం కూడా ప్ర‌త్యేకంగా నిలుస్తోంది. ద‌క్షిణాఫ్రికాతో శ‌నివారం విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే సిరీస్ విజేత‌ను తేల్చేది కావ‌డంతో మ‌రింత మ‌జా అందిస్తోంది. ఈ సిరీస్ లో భాగంగా రాంచీలో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమ్ ఇండియా 349 ప‌రుగులు చేసినా కేవ‌లం 17 ప‌రుగుల తేడాతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. రెండో వ‌న్డేలో మాత్రం ద‌క్షిణాఫ్రికా 358 ప‌రుగుల రికార్డు టార్గెట్ ను ఛేదించేసింది. దీంతో మూడో వ‌న్డేలో ఏం జ‌రుగుతుంది? అనే ఆస‌క్తి నెల‌కొంది. ఇక తొలి వ‌న్డేలో 135, రెండో మ్యాచ్ లో 102 ప‌రుగుల‌తో సెంచ‌రీలు కొట్టిన కోహ్లి.. బ్యాటింగ్ కు అనుకూలించే విశాఖ పిచ్ పై చెల‌రేగ‌డం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. పైగా గ‌త రెండు మ్యాచ్ ల త‌ర‌హాలో విశాఖ‌లో రాత్రి పూట మంచు ప్ర‌భావం ఉండ‌దు.

ట‌న్ మెషీన్ కోసం..

కోహ్లి హ్యాట్రిక్ సెంచ‌రీ చూసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. దీంతో విశాఖ‌ క్రికెట్ స్డేడియంలో శ‌నివారం జ‌రిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేక్ ల త‌ర‌హాలో అమ్ముడ‌వుతున్నాయ‌ని ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టికే గత నెల 28న ఆన్ లైన్ లో అమ్మ‌కానికి పెట్టారు. ఇప్పుడు ఆఫ్ లైన్ లో విక్ర‌యాలు సాగిస్తున్నారు. రూ.15 వేల ఖ‌రీదైన టికెట్లు మాత్ర‌మే ఆల‌స్యంగా అమ్ముడ‌వుతున్నాయి. న‌వంబ‌రు 30, డిసెంబ‌రు 3న రెండో విడ‌త సేల్స్ మొద‌లుపెట్టారు. 30న రాంచీలో జ‌రిగిన మ్యాచ్ లో కోహ్లి సెంచ‌రీతో టికెట్ల అమ్మ‌కాలు బాగా ఊపందుకున్నాయి. 3న మ‌రో సెంచ‌రీ కొట్ట‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.

యావ‌రేజ్ ప్ర‌కారం కొట్టినా

ఏడు మ్యాచ్ లు 587 ప‌రుగులు.. యావ‌రేజ్ 97పైనే.. ఇదీ విశాఖలో కోహ్లి రికార్డు. మూడు సెంచ‌రీలు, రెండు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఇప్పుడు యావ‌రేజ్ గా చూసినా కోహ్లి సెంచ‌రీ కొట్ట‌డం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. అందుకే రాంచీ సెంచ‌రీ త‌ర్వాత విశాఖ వ‌న్డే టికెట్ల అమ్మ‌కాలు ఊపందుకున్నాయ‌ని ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ స‌భ్యులు చెబుతున్నారు.