Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ అగ్రెషన్ వెనుక అసలు నిజం..

విరాట్ కోహ్లీ చూపే ప్రతీ హావభావం వెనుక.. ప్రతీ అరుపు వెనుక ఏదో ఒక ఆరాటం కనిపిస్తుంది.

By:  A.N.Kumar   |   4 Aug 2026 8:00 PM IST
విరాట్ కోహ్లీ అగ్రెషన్ వెనుక అసలు నిజం..
X

క్రికెట్ ప్రపంచంలో ఆయనొక సంచలనం. మైదానంలో ఆయన అడుగుపెడితే గాలికూడా వేగం పుంజుకుంటుంది. విరాట్ కోహ్లీ చూపే ప్రతీ హావభావం వెనుక.. ప్రతీ అరుపు వెనుక ఏదో ఒక ఆరాటం కనిపిస్తుంది. కొందరికి అది తీవ్రమైన ఆవేశంలా అనిపిస్తే అభిమానులకు మాత్రం అది తన మాతృభూమి కోసం, జట్టు విజయం కోసం గెలవాలనే ఓ పవిత్రమైన తపనలా కనిపిస్తుంది. తాజాగా మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కోహ్లీలోని అసలైన వ్యక్తిత్వాన్ని.. ఆయన ఆట పట్ల చూపే అంకితభావమైన ప్రేమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి.

ఢిల్లీ జూనియర్ క్రికెట్ రోజుల్లో పసి వయసులోనే కోహ్లీ ఆటలోని తీవ్రతను అతిదగ్గరగా చూసిన వ్యక్తి అనిల్ చౌదరి. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే అగ్రెషన్ ఎవరిపైనా ఉన్న వ్యక్తిగత ద్వేషం కాదని ఆయన స్పష్టం చేశారు. విరాట్ ఆవేశం వెనుక ఎప్పుడూ ఎవరిపై పగ ఉండదని.. అది కేవలం ఏ మూలన ఉన్న అవకాశాన్నైనా ఒడిసిపట్టుకుని మ్యాచ్‌ను గెలిపించాలనే పిచ్చి ఆరాటం మాత్రమేనని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర భారత క్రికెటర్ల నరనరాల్లో ప్రవహించే అత్యంత తీవ్రమైన పోటీ తత్వమే కోహ్లీ ఆటలో ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు.

మైదానంలో విరాట్ ఎంత ఉగ్రరూపం దాల్చినా.. ఆట నియమాలను.. అంపైర్ల నిర్ణయాలను ఒక క్రమశిక్షణ గల శిష్యుడిలా గౌరవిస్తాడని అనిల్ చౌదరి వెల్లడించారు. అంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని మనస్ఫూర్తిగా అంగీకరించడమే కాకుండా మైదానంలో వారితో సరదాగా మాట్లాడుతూ సమయాన్ని పంచుకునే సున్నితమైన మనస్తత్వం కూడా ఆయనలో ఉందని గుర్తు చేసుకున్నారు. 2013 ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్‌తో జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ ఆటలో అలాంటి ఉద్వేగాలు సహజమేనని, అయితే ఆటగాళ్ళు హద్దులను గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిన కోహ్లీ ఇప్పుడు తన పూర్తి దృష్టిని 2027 వన్డే ప్రపంచకప్‌పైనే కేంద్రీకరించాడు. వయసు పెరుగుతున్నా, కెరీర్ ముగింపు దశకు వస్తున్నా ఆయనలోని ఆ గెలుపు జ్వాల మాత్రం రవ్వంతైనా తగ్గలేదు. విరాట్ కోహ్లీ అగ్రెషన్‌పై ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఆ ఆవేశాన్ని ఒక ఆభరణంగానే భావిస్తారు. ఆ అగ్రెషనే కోహ్లీని ఒక సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచపు అత్యుత్తమ క్రికెట్ లెజెండ్‌గా నిలబెట్టింది. మైదానంలో విరాట్ గర్జిస్తున్నాడంటే, అది కేవలం ఆయన ఆవేశం కాదు... కోట్ల మంది భారతీయుల గెలుపు ఆశలకు ప్రతిరూపం!