Begin typing your search above and press return to search.

సచిన్ శకానికి చేరువలో విరాట్.. సాధించేస్తాడా? సాధ్యమేనా?

అంటే క్రికెట్ దేవుడిగా కొలవబడే సచిన్ కంటే ఏకంగా 74 ఇన్నింగ్స్‌లు తక్కువలోనే కోహ్లీ ఈ మైలురాయిని దాటేశాడు.

By:  A.N.Kumar   |   28 Sept 2026 10:44 AM IST
సచిన్ శకానికి చేరువలో విరాట్.. సాధించేస్తాడా? సాధ్యమేనా?
X

క్రికెట్ చరిత్రలో కొన్ని మైలురాళ్లు కేవలం రికార్డు పుస్తకాలకే పరిమితం కావు.. అవి తరాల మధ్య అంతరాన్ని తుడిచేసే అపూర్వ ఘట్టాలుగా నిలిచిపోతాయి. దిగ్గజాలు నడిచిన బాటలో పయనిస్తూ ఆ బాటనే సరికొత్త వేగంతో పునర్నిర్మించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. టీమిండియా పరుగుల యంత్రం.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరిగ్గా అదే చేశాడు. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగుల అద్భుత మైలురాయిని చేరుకోవడం ద్వారా శతాబ్దపు దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలిచిన కోహ్లీ తన అసాధారణ స్థిరత్వాన్ని మరోసారి జగద్విదితం చేశాడు.

అంకెలు చెప్పే నిజం.. సంఖ్య కాదు.. పరుగుల వేగం ప్రసిద్ధం

ఈ చారిత్రాత్మక రికార్డులో అసలు విశేషం కేవలం 15,000 పరుగులు పూర్తి కావడం కాదు.. ఆ మార్క్‌ను కోహ్లీ అందుకున్న 'రాకెట్ వేగం'. సచిన్ టెండూల్కర్ 15 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 377 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అదే విరాట్ కోహ్లీ కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ అపూర్వ ఘనతను సొంతం చేసుకున్నాడు.

అంటే క్రికెట్ దేవుడిగా కొలవబడే సచిన్ కంటే ఏకంగా 74 ఇన్నింగ్స్‌లు తక్కువలోనే కోహ్లీ ఈ మైలురాయిని దాటేశాడు. ఆధునిక క్రికెట్‌లో ఫిట్‌నెస్, అనుకూలన శక్తి , మానసిక దృఢత్వంలో తానెందుకు అగ్రస్థానంలో ఉన్నానో ఈ ఒక్క గణాంకమే స్పష్టం చేస్తోంది.

తిరువనంతపురం వేదికగా చారిత్రక క్షణం

వెస్టిండీస్‌తో తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ ఖాతాలో 14,941 పరుగులు ఉన్నాయి. ఈ చారిత్రక ఘనతకు కేవలం 59 పరుగుల దూరంలో ఉన్న సమయంలో కెరీర్‌లో ఎన్నోసార్లు చేసినట్లే మైదానంలో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో బంతిని బౌండరీ దాటించడంతో స్టేడియం మార్మోగిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగుల క్లబ్‌లో అడుగుపెట్టిన ప్రపంచంలోనే రెండో బ్యాటర్‌గా.. అత్యంత వేగవంతమైన క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో ఎక్కాడు.

‘కరీబియన్’ బౌలర్లపై చెదరని ఆధిపత్యం

వెస్టిండీస్‌పై కోహ్లీకి ఉన్న అత్యుత్తమ రికార్డు ఈ మ్యాచ్‌తో మరోసారి పునరావృతమైంది. కేవలం 15 వేల పరుగుల మార్క్ మాత్రమే కాకుండా ఇదే ఇన్నింగ్స్‌లో కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 80వ అర్ధశతకాన్ని కూడా నమోదు చేయడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు అరుదైన మైలురాళ్లను అందుకుని అభిమానులకు తీపి జ్ఞాపకాన్ని అందించాడు.

సచిన్ వారసత్వం.. కోహ్లీ సరికొత్త అధ్యాయం

సచిన్, కోహ్లీల మధ్య పోలికలు ఈనాటివి కావు. ఇద్దరి తరాలు వేరు, నాటి బౌలింగ్ ప్రమాణాలు, మైదాన పరిస్థితులు వేరు. కానీ రికార్డుల విషయానికి వస్తే సచిన్ నెలకొల్పిన అత్యంత కష్టసాధ్యమైన ప్రమాణాలను సైతం తన బ్యాటింగ్ శైలితో సునాయాసంగా రీ-రైట్ చేయడం కోహ్లీకే చెల్లింది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు 18,426 పరుగులు సచిన్ పేరిట సురక్షితంగా ఉన్నప్పటికీ కోహ్లీ ప్రయాణం ఇంకా కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఘనత కేవలం కోహ్లీ వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు.. భారత క్రికెట్ దిగ్గజాల వారసత్వానికి.. ఆధునిక శకపు వేగానికి నడుమ రూపుదిద్దుకున్న ఒక అద్భుత కావ్యంగా నిలిచిపోతుంది.