Begin typing your search above and press return to search.

'వైస్ కెప్టెన్.. ఏంటిది?'.. అంటూ వైభవ్‌ను స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వైరల్ వీడియో

స్లెడ్జింగ్ జరిగిన కాసేపటికే వైభవ్ (37 బంతుల్లో 44 పరుగులు) చామా మిలింద్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.

By:  A.N.Kumar   |   7 Sept 2026 12:08 PM IST
వైస్ కెప్టెన్.. ఏంటిది?.. అంటూ  వైభవ్‌ను స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ..  వైరల్  వీడియో
X

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ రసవత్తర పోరులో ఈస్ట్ జోన్ 15 ఏళ్ల సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మైదానంలో టీజ్ చేయడం విశేషంగా మారింది.

సిరాజ్‌పై విరుచుకుపడ్డ వైభవ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే జెట్ స్పీడులో పరుగులు అందించాడు. సీనియర్ భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఏమాత్రం భయం లేకుండా ఎదుర్కొంటూ ఒకే ఓవర్‌లో వరుసగా 4, 6, 4 బాది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్ చూపిస్తున్న ఈ దూకుడును గమనించిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ.. మైండ్ గేమ్‌లో భాగంగా ఫీల్డింగ్ చేస్తూనే “క్యా యార్ యే వైస్ కెప్టెన్..” (ఏంటిది వైస్ కెప్టెన్..) అంటూ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు.

తిలక్ వ్యాఖ్యలకు వైభవ్ చిరునవ్వుతో స్పందించడంతో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు సమీపించుకుని నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల కుర్రాడిపై స్లెడ్జింగ్ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇది క్రికెట్‌లో భాగమేనని సమర్థిస్తున్నారు.

తొలి రోజు ఈస్ట్ జోన్ భారీ స్కోరు

స్లెడ్జింగ్ జరిగిన కాసేపటికే వైభవ్ (37 బంతుల్లో 44 పరుగులు) చామా మిలింద్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72) దన్నుగా నిలవడంతో ఈస్ట్ జోన్‌కు శుభారంభం లభించింది. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన అజేయ సెంచరీ (111 నాటౌట్) బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ బౌలర్లలో చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇటీవలే 57 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ (92 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, రెండో ఇన్నింగ్స్‌లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా చూస్తే వైభవ్ సూర్యవంశీకి అర్ధశతకం చేజారినప్పటికీ.. తిలక్ వర్మతో జరిగిన స్లెడ్జింగ్ ఘటన, సిరాజ్‌పై అతడి దూకుడు బ్యాటింగ్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ ఎలా స్పందిస్తాడో.. మరో భారీ ఇన్నింగ్స్‌తో తన రికార్డుల పరంపరను కొనసాగిస్తాడో చూడాలి.