Begin typing your search above and press return to search.

వైభవ్ సూర్యవంశీ ఎంట్రీని ఎందుకు ఆపారు.? అసలు నిజం తెలిసింది..

ఐర్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్నా పర్లేదు కానీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం తమ 'ఆటగాళ్లపై నమ్మకం' అనే సిద్ధాంతాన్ని అస్సలు వదులుకోనంటోంది.

By:  A.N.Kumar   |   30 Jun 2026 11:00 PM IST
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీని ఎందుకు ఆపారు.? అసలు నిజం తెలిసింది..
X

ఐర్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్నా పర్లేదు కానీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం తమ 'ఆటగాళ్లపై నమ్మకం' అనే సిద్ధాంతాన్ని అస్సలు వదులుకోనంటోంది. ఐపీఎల్‌లో 15 ఏళ్ల వయసులోనే 230కి పైగా స్ట్రైక్‌రేట్‌తో కొడితే.. 'భలే కొట్టావ్ తమ్ముడూ, కాసేపు వెయిటింగ్ రూమ్‌లో కూర్చో' అంటూ వైభవ్ సూర్యవంశీకి అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ క్లాస్ పీకారు. వరల్డ్ కప్ గెలిపించిన సీనియర్లను ఒకటి రెండు మ్యాచ్‌ల ఫ్లాప్‌లకే పక్కన పెట్టేస్తే ఎలా అని ఆయన లాజిక్ తీశారు.. అయితే అదే సీనియర్లు ఐర్లాండ్ లాంటి జట్టుపై కూడా చేతులెత్తేస్తే ఫ్యాన్స్ గుండెలు ఎలా మండుతాయో పాపం కోచ్ గారికి ఎవరు చెబుతారు? ఏదేమైనా.. 'నీ టాలెంట్‌పై మాకు డౌట్ లేదు కానీ, నీకంటూ ఒక టైం రావాలి బాబూ' అంటూ వైభవ్‌ చేతికి నిమ్మకాయలు ఇచ్చినంత పని చేసింది మేనేజ్‌మెంట్. జూలై 1 నుంచి ఇంగ్లాండ్ సిరీస్ మొదలవుతోంది.. అక్కడైనా ఈ వండర్ కిడ్‌ని గ్రౌండ్‌లోకి దింపుతారా లేక 'రొటేషన్ పాలసీ' పేరుతో బెంచ్‌కే పరిమితం చేసి సచిన్ రికార్డును బ్రతికించేస్తారా అనేది చూడాలి..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇంకా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే 230కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు సాధించి, టోర్నమెంట్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిన వైభవ్‌ను ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో భారత్ ఆ సిరీస్‌ను 0-2తో కోల్పోవడం, చివరి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చింది.

ఈ వివాదంపై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ జట్టు ఎంపిక వెనుక ఉన్న ఆలోచనను వివరించారు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడం మాత్రమే అంతర్జాతీయ జట్టులో వెంటనే చోటు దక్కుతుందనే అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం టీమిండియాకు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఆటగాళ్లపై జట్టు యాజమాన్యానికి పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి అనుభవజ్ఞుల్ని ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల వైఫల్యాల ఆధారంగా పక్కన పెట్టడం సరైన విధానం కాదని చెప్పారు.

ఆటగాళ్లకు దీర్ఘకాలిక అవకాశాలు ఇవ్వడం.. వారిపై విశ్వాసం ఉంచడం జట్టు నిర్వహణ ప్రధాన విధానమని డోస్కాట్ వెల్లడించారు. అదే కారణంగా ప్రస్తుతం ఉన్న సీనియర్ల స్థానంలో కొత్తవారిని తీసుకొచ్చే విషయంలో తొందరపడడం లేదని వివరించారు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై తమకు ఎలాంటి సందేహం లేదని, అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని కూడా ఆయన స్పష్టం చేశారు.

వైభవ్ ఎంపిక విషయంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ గతంలో చెప్పిన అభిప్రాయాన్నే డోస్కాట్ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రతి ఆటగాడిలాగే వైభవ్ కూడా జట్టు ఎంపిక ప్రక్రియలో తన వంతు సమయం కోసం ఎదురుచూడాల్సిందేనని చెప్పారు. అతడిని భారత జెర్సీలో మైదానంలో చూడాలని కోచింగ్ స్టాఫ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోందని.. అయితే అందుకు సరైన సమయం రావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు అందరి చూపు ఇంగ్లాండ్ పర్యటనపైనే ఉంది. ఐర్లాండ్ సిరీస్ అనంతరం భారత్ జూలై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోనైనా వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ ఈ పర్యటనలోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డును అధిగమించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు చర్చిస్తున్నాయి. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.