Begin typing your search above and press return to search.

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు ఈ పాత వివాదానికి మరోసారి పెట్రోల్ పోసి మంటపుట్టించినట్టైంది.

By:  A.N.Kumar   |   7 Nov 2026 1:52 PM IST
శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా
X

టీంలో ఉన్నప్పుడు అసలు ఆ ముచ్చటే తీయరు. తీస్తే స్థానం గల్లంతు..జట్టులోంచి ఔట్.. అదే రిటైర్ అయ్యాక.. మీ ఇష్టమొచ్చింది మాట్లాడుకోవచ్చు. పాత విషయాలన్నీ తీసి క్రికెట్ లో మంటపుట్టించవచ్చు. ఇప్పుడు ఇదే జరిగింది. రిటైర్ మెంట్ తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఉష్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపుట్టే వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్ చరిత్రలో కొన్ని వివాదాలు కాలం గడిచినా మరుగున పడవు. అలాంటి వాటిలో ఆస్ట్రేలియా క్రికెట్‌ను తీవ్రంగా కుదిపేసిన 2018 నాటి శాండ్‌పేపర్ ఘటన ఒకటి. ఈ ఘటన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు.. విధించిన శిక్షలపై చర్చలు అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు ఈ పాత వివాదానికి మరోసారి పెట్రోల్ పోసి మంటపుట్టించినట్టైంది.

2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన ఘటన ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ వివాదంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై కఠిన చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అయితే ఈ ఘటనలో కేవలం ఆ ముగ్గురినే బాధ్యులుగా చూడటం సరైనదేనా? జట్టులోని మిగతా సభ్యుల బాధ్యత ఏమిటి అనే ప్రశ్నలను ఇప్పుడు ఉస్మాన్ ఖవాజా బహిరంగంగా లేవనెత్తారు.

శాండ్‌పేపర్ ఘటనలో బ్యాటర్లు, బౌలర్లు, సహాయక సిబ్బంది అంటూ విడివిడిగా చూడాల్సిన అవసరం లేదని ఖవాజా అభిప్రాయపడ్డారు. మైదానంలో ఏం జరుగుతుందో మొత్తం జట్టుకు తెలుసని.. అందరూ కలిసి బాధ్యత తీసుకోవాల్సి ఉండగా చివరకు ఆ ముగ్గురు మాత్రమే తీవ్ర పరిణామాలను ఎదుర్కొని శిక్షించబడ్డారని ఆయన పేర్కొన్నారు. ఒక జట్టుగా ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ.. కేవలం ఆ ముగ్గురిపైనే మొత్తం భారం తోసేశారని ఆయన బాంబుపేల్చారు. ఖవాజా చేసిన వ్యాఖ్యలు కేవలం ముగ్గురు ఆటగాళ్ల నే బాధ్యులను చేయడం కరెక్ట్ కాదన్న వాస్తవాన్ని చెబుతున్నాయి.

శాండ్‌పేపర్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్ఠకు భారీ దెబ్బ తీసింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ కెరీర్‌లో కీలకమైన సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి తమ స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ ఆ వివాదం మాత్రం వారి కెరీర్‌లో చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఇప్పుడు ఖవాజా చేసిన వ్యాఖ్యలతో ఇందులో తప్పు అందరిదీ ఉందన్న వాస్తవం బయటపడింది. క్రికెట్ ఆస్ట్రేలియా పరువు పోయినట్టైంది.