చరిత్రలో తొలి.. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఇద్దరు తెలుగోళ్లు
సిరాజ్ రెండు టి20 ప్రపంచ కప్ లు నెగ్గిన టీమ్ ఇండియాలో సభ్యుడు. 2024లో అమెరికా-కరీబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి20 ప్రపంచ కప్ జట్టులో సిరాజ్ ఉన్నాడు.
By: Tupaki Political Desk | 9 March 2026 10:22 AM ISTఒకప్పటి ఎంఎల్ జైసింహా నుంచి టీమ్ఇండియాకు మూడు వరుస వన్డే ప్రపంచ కప్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన అరుదైన రికార్డున్న మొహమ్మద్ అజహరుద్దీన్ వరకు... వీవీఎస్ లక్ష్మణ్ నుంచి.. హనుమ విహారి వరకు గొప్ప బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు.. అంబటి రాయుడు వంటి వారు భవిష్యత్ సచిన్ టెండూల్కర్ అని 25 ఏళ్ల కిందటే పొగడ్తలు అందుకున్నారు. కానీ, వీరెవరికీ సాధ్యం కానిది ఒకటి ఉంది..! అదే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉండడం. టెస్టుల్లో మేటి బ్యాటర్ గా ఎదిగి వందకు పైగా మ్యాచ్ లు ఆడిన లక్ష్మణ్ అయితే ప్రపంచ కప్ (వన్డే) ఆడనే లేదు. కానీ, చరిత్రలో హైదరాబాదీ మేటి పేసర్ మొహమ్మద్ సిరాజ్...యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ మాత్రం ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. చరిత్రలో తొలిసారి ఒక ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఇద్దరు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉన్నారు.
మరింతగా చెప్పుకోవాలంటే..
సిరాజ్ రెండు టి20 ప్రపంచ కప్ లు నెగ్గిన టీమ్ ఇండియాలో సభ్యుడు. 2024లో అమెరికా-కరీబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి20 ప్రపంచ కప్ జట్టులో సిరాజ్ ఉన్నాడు. నాడు దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచాక మొదటగా గ్రౌండ్ లోకి వచ్చింది సిరాజే. ఇప్పుడు కూడా ఆదివారం అహ్మదాబాద్ మైదానంలో సిరాజ్ జాతీయ జెండాతో హల్ చల్ చేశాడు. కాకపోతే, గత ప్రపంచ కప్ లో అతడికి ఆడే చాన్స్ రాలేదు. ఈసారి కూడా మొదటి మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. కానీ, జట్టులో మాత్రం ఉన్నాడు. తాజా టి20 మెగా టోర్నీలో అమెరికాతో మ్యాచ్ కు మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా అస్వస్థతతో దూరమయ్యాడు. దీంతో సిరాజ్ పేస్ బాధ్యతలను తలకెత్తుకుని మూడు వికెట్లు తీసి గెలుపులో భాగమయ్యాడు.
తిలక్ ఆసాంతం..
గత టి20 ప్రపంచ కప్ సమయానికి తిలక్ టీమ్ఇండియాలో లేడు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్ కావడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. జట్టులో స్థిరపడిపోయాడు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ మొత్తం ఆడాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్ లతో (సెమీఫైనల్లో ఇంగ్లండ్ పై 7 బంతుల్లో 21, క్వార్టర్స్ లో వెస్టిండీస్ పై 27, సూపర్ 8లో జింబాబ్వేపై 16 బంతుల్లోనే 44 నాటౌట్) అలరించాడు. విజేత జట్టులో భాగమై రికార్డుల్లో నిలిచాడు.
వన్డే ప్రపంచ కప్ లోనూ ఈ ఇద్దరూ..
సిరాజ్ గొప్పదనం ఏమంటే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ (2023) ఆడాడు. టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. తిలక్ ఇంకా వన్డేల్లోకి రావాల్సి ఉంది. 2027 ప్రపంచ కప్ జట్టులో సిరాజ్ ఖాయంగా ఉంటాడు. అప్పటికి రోహిత్, కోహ్లి రిటైరైతే తిలక్ కు కూడా చాన్స్ రావొచ్చు. ఒకవేళ తుది జట్టులో ఈ ఇద్దరూ ఉండి.. టీమ్ఇండియా ప్రపంచ కప్ కూడా గెలిస్తే అదొక రికార్డు.
