Begin typing your search above and press return to search.

టీ20 చిచ్చరపిడుగు.. టెస్టులనే ప్రాణమంటున్నాడు.. ఏంటా కథ

భారత యువ సంచలనం తిలక్ వర్మ తన క్రికెట్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   3 Sept 2026 10:00 PM IST
టీ20 చిచ్చరపిడుగు.. టెస్టులనే ప్రాణమంటున్నాడు.. ఏంటా కథ
X

భారత యువ సంచలనం తిలక్ వర్మ తన క్రికెట్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తనకు రెడ్ బాల్ క్రికెట్ టెస్టులు అంటేనే అత్యంత ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. టెస్టు క్రికెట్ తన రక్తంలోనే ఉందని, భారత్ తరఫున వైట్ బాల్ క్రికెట్ ఆడతానని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొనడం విశేషం.

ఐపీఎల్ అందించిన ఊపు.. మారిన ప్రయాణం

చిన్నప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లోనే ఎక్కువగా రాణించాలని అనుకున్నట్లు తిలక్ వర్మ వెల్లడించారు. అయితే పరిస్థితులు, అవకాశాల రీత్యా ఆయన కెరీర్ పరిమిత ఓవర్ల వైపు మళ్లింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లభించిన అవకాశాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ వేదికగా తన ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్‌పై తనకున్న మక్కువ తగ్గలేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.

రెడ్ బాల్ క్రికెట్‌తోనే అసలైన నైపుణ్యం

రెడ్ బాల్ క్రికెట్ ఆడటం వల్ల వైట్ బాల్ ఫార్మాట్‌లో రాణించడం సులభమవుతుందని తిలక్ అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో ఎక్కువసేపు క్రీజులో ఉండటం బ్యాటర్‌కు గట్టి పునాదిని ఇస్తుంది. బంతిని సరిగ్గా గమనించడం.. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం వంటివి రెడ్ బాల్ ఆడితేనే వస్తాయి. టెస్టుల్లో లభించే మైండ్ సెట్, ఏకాగ్రత టీ20లు, వన్డేలలో ఒత్తిడిని జయించడానికి ఉపకరిస్తాయి.

దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన

ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి వరుసగా 116, 51 పరుగులు సాధించారు. క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో సుదీర్ఘకాలం నిలబడే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ ప్రదర్శనతో తనకు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉందని సెలెక్టర్లకు బలమైన సంకేతాలు పంపారు.

టెస్టు క్యాప్ కోసం ఎదురుచూపులు

వైట్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తిలక్ వర్మ, ఇప్పుడు టీమిండియా టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే అన్ని ఫార్మాట్లకు తగినట్లుగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోగల సామర్థ్యం ఆయనకు అదనపు బలంగా మారింది. దులీప్ ట్రోఫీలో చూపిన ప్రతిభతో త్వరలోనే ఆయనకు భారత టెస్టు జట్టులో పిలుపు వస్తుందని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.