పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలిచి 9వసారి టైటిల్ సాధించింది. ఈ విజయంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుకు చెందిన చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 5 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన సుభాష్, చివర్లో 8 బంతుల్లో 11 పరుగులు చేసి భారత్ విజయంలో భాగమయ్యాడు.
By: Tupaki Political Desk | 16 Nov 2026 1:55 AM ISTఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన సంచలన విజయంలో తెలుగు తేజం చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక పాత్ర పోషించాడు. ఒమన్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ చివరి బంతికి ఒకే ఒక్క వికెట్ తేడాతో గెలిచి రికార్డు స్థాయిలో 9వసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రక విజయంలో 18 ఏళ్ల ఆల్‌రౌండర్ సుభాష్ తన బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచాడు. సుభాష్ పూర్తి పేరు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్. గుంటూరు సమీపంలో వట్టిచెరుకూరు స్వస్థలం. తండ్రి పూర్ణచంద్రరావు ఉద్యోగ రీత్యా గోవాలో స్థిరపడినట్లు చెబుతున్నారు.
అండర్ 19 మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న సమయంలో బౌలింగ్‌కు దిగిన సుభాష్, తన పేస్ బౌలింగ్‌తో పాక్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. కేవలం 5 ఓవర్లు వేసిన సుభాష్ 40 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా అర్ధ సెంచరీతో జోరు మీదున్న పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ (63)తో పాటు అహ్మద్ హుస్సేన్ (17), హస్నైన్ అబ్బాస్ దార్ (2)లను అవుట్ చేసి పాక్ స్కోరును 337/9 వద్ద కట్టడి చేయడంలో ప్రధాన భూమిక పోషించాడు. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 309 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. విజయానికి 29 పరుగులు అవసరమైన క్లిష్ట దశలో చివరి బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన సుభాష్ ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా ఎంతో పరిణతితో ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' మోహిత్ ఉల్వా (49* నాటౌట్)కు చక్కటి సహకారం అందిస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా, అవసరమైన సమయంలో కీలక బౌండరీ బాది పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సుభాష్ కేవలం 8 బంతుల్లో 11 పరుగులు (నాటౌట్) చేయగా, ఉల్వాతో కలిసి చివరి వికెట్‌కు అబేధ్యంగా 16 బంతుల్లో 30 పరుగులు జోడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సుభాష్ తెలుగు వాడన్న సమాచారంతో రెండు రాష్ట్రాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సుభాష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు. అతడి తండ్రి పూర్ణచంద్రరావు ఉద్యోగ రీత్యా కొన్నేళ్ల క్రితమే గోవాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో సుభాష్ దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2022లో విజయ్ మర్చంట్ ట్రోఫీతో గోవా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించిన అతడు, అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాలతో పాటు కూచ్ బెహార్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
భారత అండర్-19 జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ముందు 2026 సీజన్‌లో సుభాష్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. జూలైలో శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి 5 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లోనూ 25 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆగస్టులో ఒమన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సుభాష్, తన తొలి మ్యాచ్‌లోనే 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. సెప్టెంబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ 4 వికెట్లు తీసి (ఒక మ్యాచ్‌లో 3/64) తన బౌలింగ్ పదును చూపించాడు.ప్రస్తుతం భారత సీనియర్ జట్టులో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి వంటి తెలుగు క్రికెటర్లు రాణిస్తుండగా, అదే బాటలో భవిష్యత్ స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న చిగురుపాటి సుభాష్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
