Begin typing your search above and press return to search.

టెంట్ల కింద డ్రెస్సింగ్ రూమ్స్.. 500 మీటర్ల దూరంలో వాష్‌రూమ్స్.. బీసీసీఐ ఆగ్రహం!

కానీ.. ఆసియా క్రీడల్లో క్రికెట్ కోసం జపాన్‌లో జరుగుతున్న ఏర్పాట్లపై వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

By:  A.N.Kumar   |   28 Aug 2026 7:00 PM IST
టెంట్ల కింద డ్రెస్సింగ్ రూమ్స్.. 500 మీటర్ల దూరంలో వాష్‌రూమ్స్.. బీసీసీఐ ఆగ్రహం!
X

క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రతిభ ఎంత ముఖ్యమో.. వారికి కల్పించే సౌకర్యాలు కూడా అంతే కీలకం. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లకు కనీస మౌలిక వసతులు అందించడం నిర్వాహకుల బాధ్యత. కానీ.. ఆసియా క్రీడల్లో క్రికెట్ కోసం జపాన్‌లో జరుగుతున్న ఏర్పాట్లపై వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

డ్రెస్సింగ్ రూమ్ టెంట్ల కింద.. వాష్‌రూమ్‌లు ఏకంగా 500 మీటర్ల దూరంలో

ఇది ఏదైనా చిన్నస్థాయి స్థానిక టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లు అనుకుంటే పొరపాటే. ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రికెటర్ల కోసం చేసిన ఏర్పాట్ల గురించే ఈ విమర్శలు వినిపిస్తున్నాయి.

డ్రెస్సింగ్ రూమ్ ఉంది.. కానీ టెంట్‌లో

ఆసియా క్రీడల క్రికెట్ టోర్నీ కోసం ఆటగాళ్లు జెర్సీలు మార్చుకునేందుకు టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడితో సమస్య ముగియలేదు. ఆటగాళ్లు ఉపయోగించాల్సిన వాష్‌రూమ్‌లు ఈ టెంట్లకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే.. మ్యాచ్ మధ్యలో అత్యవసర అవసరం వచ్చినా ఆటగాళ్లు వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే అంత దూరం నడవాల్సిందే అన్నమాట. క్రీడాకారులు మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయంలో.. ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం ఇబ్బంది పడాల్సి రావడం ఇప్పుడు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

టీమిండియాకు మాత్రం ఎందుకీ నిర్లక్ష్యం?

ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఆసియా క్రీడలు సాధారణ క్రికెట్ టోర్నీ కాదు. ఆసియా దేశాల నుంచి అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొనే ప్రతిష్టాత్మక ఈవెంట్. అలాంటి వేదికపై క్రికెట్‌కు ప్రాధాన్యత పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

ముఖ్యంగా భారత జట్టు ఈ టోర్నీపై ప్రత్యేక దృష్టితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియాలో క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకురావడంతో పాటు.. అంతర్జాతీయ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని టీమిండియా భావిస్తోంది. కానీ మైదానంలోకి దిగకముందే సౌకర్యాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే ఆటగాళ్ల మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీ టీమ్‌ను పంపిస్తామన్న హెచ్చరిక?

ఈ ఏర్పాట్లపై భారత క్రికెట్ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ తరఫున పూర్తి స్థాయి జట్టుకు బదులుగా బీ టీమ్‌ను పంపించే అవకాశం ఉందనే హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఆసియా క్రీడల ఏర్పాట్లను పరిశీలించేందుకు భారత్ తరఫున ప్రత్యేకంగా ఒక అబ్జర్వర్‌ను పంపించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమా?

నిర్వాహకులు ఈ తరహా తాత్కాలిక ఏర్పాట్లను తమకు గర్వకారణంగా చెబుతున్నారన్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్ నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ.. మరోవైపు ఆటగాళ్లకు కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడటం ఎలా సమర్థించుకోవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. క్రీడాకారులకు విలాసవంతమైన సౌకర్యాలు అవసరం లేదనే వాదన ఉండొచ్చు. కానీ డ్రెస్సింగ్ రూమ్, వాష్‌రూమ్ వంటి ప్రాథమిక సదుపాయాలు మాత్రం తప్పనిసరి. అవి కూడా ఆటగాళ్లకు సులభంగా అందుబాటులో ఉండాలి.

క్రికెట్‌ను ఆసియాలో విస్తరించాలంటే ఇదేనా మార్గం?

ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు తిరిగి చోటు దక్కడం ఈ క్రీడ విస్తరణకు కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. క్రికెట్‌ను కేవలం కొన్ని దేశాలకు పరిమితం చేయకుండా ఆసియాలోని మరిన్ని దేశాలకు తీసుకెళ్లాలంటే ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లే కీలకం. కానీ ఆటగాళ్లకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోతే.. క్రికెట్‌ను కొత్త దేశాల్లో ప్రోత్సహించాలన్న లక్ష్యానికి అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

క్రికెట్‌ను ఆసియాలో విస్తరించాలంటే ముందుగా క్రికెటర్లకు గౌరవం ఇవ్వాలి

మ్యాచ్ గెలవడానికి ఆటగాళ్లు మైదానంలో పోరాడాలి. కానీ మైదానం బయట కనీస అవసరాల కోసం వారు పోరాడాల్సిన పరిస్థితి రావడం మాత్రం నిర్వాహకుల వైఫల్యంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికైనా నిర్వాహకులు స్పందించి.. ఆటగాళ్లకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని భారత క్రికెట్ వర్గాలు కోరుతున్నట్లు సమాచారం. లేకపోతే ఆసియా క్రీడల క్రికెట్ టోర్నీ ప్రారంభానికి ముందే ‘టెంట్ డ్రెస్సింగ్ రూమ్.. 500 మీటర్ల వాష్‌రూమ్’ వ్యవహారం నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశముంది.