టీమ్‌ఇండియా 'టాస్'లాస్ మిస్టరీ: ఈ దురదృష్టానికి బ్రేక్ ఎప్పుడు?
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తాజాగా జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో మరో మూడు టాస్‌ల ఓటమి.
By: A.N.Kumar | 27 Oct 2025 11:33 PM ISTఎంతటి బలమైన జట్టుకైనా మైదానంలో విజయానికి అదృష్టం కూడా కొంత తోడవ్వాలి. కానీ, ఆ అదృష్టం మాత్రం వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాను మొండిగా దూరం పెడుతోంది. అందుకు కారణం? టాస్‌ల్లో వరుస ఓటముల పరంపర!
టాస్ లాస్ పరంపర ఆరంభం!
భారత క్రికెట్ అభిమానులకు ఈ దురదృష్ట ఘట్టం 2023, నవంబర్ 19న జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌తో మొదలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో కీలకమైన ఆ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయింది. అప్పటి నుంచి మొదలైన భారత 'టాస్ దురదృష్టం' తర్వాత జరిగిన ప్రతి వన్డేలోనూ కొనసాగుతూ వస్తోంది.
రెండు సంవత్సరాల 'ఒకే దిశ' ప్రయాణం!
గణాంకాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మకమానవు! గత 18 వన్డే మ్యాచ్‌లలో టీమ్‌ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఈ క్రమంలో అంతకుముందు 11 వరుస టాస్‌లు ఓడిన నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును కూడా భారతజట్టు బద్దలు కొట్టింది. ఈ గణాంకం కేవలం సంఖ్య కాదు.ప్రతి భారత అభిమానిని కంగారు పెట్టే ఓ పెద్ద ప్రశ్న.
కెప్టెన్లు మారినా.. అదృష్టం మాత్రం మారలేదు!
విశేషం ఏమిటంటే, కెప్టెన్లు మారినా టాస్‌లో ఫలితం మాత్రం ఒక్కటే! రోహిత్ శర్మ నుంచి... కేఎల్ రాహుల్ సారథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో మూడు టాస్‌ల ఓటమి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తాజాగా జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో మరో మూడు టాస్‌ల ఓటమి.
అయినా, మైదానంలో మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తూ ఈ కాలంలో 10 మ్యాచుల్లో విజయం సాధించడం గమనార్హం. టాస్ కోల్పోయినా, మ్యాచులను గెలవగలమనే స్ఫూర్తిని టీమ్‌ఇండియా నిలబెట్టుకుంది.
టాస్ దురదృష్టానికి ఎక్కడ బ్రేక్?
ప్రస్తుతం అభిమానులందరూ ఎదురుచూసే ప్రశ్న ఒక్కటే “తదుపరి టాస్‌లో గెలుస్తామా?” భారతజట్టు రాబోయే రోజుల్లో కీలక సిరీస్‌లు ఆడనుంది.నవంబర్, డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్. డిసెంబర్ 30న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఒకవేళ టీమ్‌ఇండియా టాస్ గెలిస్తే, ఈ సుదీర్ఘమైన 'రెండు సంవత్సరాల' దురదృష్ట పరంపర ముగిసినట్లే.
'ఆసీస్' తోనే మొదలై, ఆసీస్‌తోనే ముగుస్తుందా?
"2023లో ఆసీస్‌తో ప్రారంభమైన ఈ టాస్‌లాస్ పరంపర, 2025లో మళ్లీ ఆసీస్‌తో ఆడే మ్యాచ్‌తోనే ముగుస్తుందా?" అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. టాస్ గెలవడం మన ఆటగాళ్ల చేతిలో లేకపోయినా, ప్రతి మ్యాచ్‌లో వారు కనబరుస్తున్న పోరాట స్ఫూర్తి మాత్రం టీమ్‌ఇండియా అభిమానులను గర్వపడేలా చేస్తోంది. జట్టు అదృష్టం మారే సమయం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం!
