Begin typing your search above and press return to search.

16 నెల‌లు..అంత‌ర్జాతీయంగా ఇండియ‌న్ క్రికెట్ షైనింగ్..!

వ‌న్డేల్లో ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన‌ది చాంపియ‌న్స్ ట్రోఫీ. దీంట్లోనూ భార‌త జ‌ట్టు 2013 త‌ర్వాత విజేత‌గా నిల‌వ‌లేదు.

By:  Tupaki Political Desk   |   1 Nov 2025 9:00 AM IST
16 నెల‌లు..అంత‌ర్జాతీయంగా ఇండియ‌న్ క్రికెట్ షైనింగ్..!
X

స‌రిగ్గా రెండేళ్ల కింద‌ట జ‌రిగింది పురుషుల‌ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్..! అందులో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ కు చేరింది. కానీ, చివ‌రి మెట్టుపై బోల్తాకొట్టింది. సొంత‌గ‌డ్డ‌పై టైటిల్ చివ‌రి క్ష‌ణంలో చేజారింది. కానీ, ఆ త‌ర్వాత విదేశీ గ‌డ్డ‌పై మ‌న పేరు మార్మోగుతోంది. మొత్తంగా గ‌త 16 నెల‌ల్లో అటు పురుషులు, ఇటు అమ్మాయిలు మెరుపులు మెరిపిస్తూ వివిధ అంత‌ర్జాతీయ టోర్నీల్లో విజేత‌లుగా నిలిచారు. ఇండియ‌న్ క్రికెట్ షైనింగ్ అనిపిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా మ‌హిళలు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కు చేరిన నేప‌థ్యంలో ఏం జ‌రిగింద చూద్దామా?

టి20 ప్ర‌పంచ‌క‌ప్ తో మొద‌లు

వెస్టిండీస్ దీవులు, అమెరికా వేదిక‌గా 2024 జూన్ లో జ‌రిగింది టి20 పురుషుల ప్ర‌పంచ క‌ప్. 2007లో జ‌రిగిన తొలి టి20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత మ‌న జ‌ట్టు మ‌ళ్లీ విజేత‌గా నిల‌వ‌లేదు. అప్ప‌టికే 17 ఏళ్లు దాటిపోయింది. ఈసారి విదేశీ వేదిక కావ‌డంతో టైటిల్ కొడ‌తుందా? అనే అనుమానాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో సీనియ‌ర్లు, స్టార్ బ్యాట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు తిరిగొచ్చారు. రోహిత్ కే కెప్టెన్సీ కూడా ద‌క్కింది. ఫ‌లితంగా టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడ‌కుండా ఫైన‌ల్ చేరింది. చివ‌రి మెట్టుపై ద‌క్షిణాఫ్రికాను కూడా కొట్టేసింది. ప్ర‌పంచ చాంపియ‌న్ గా నిలిచింది.

చాంపియ‌న్స్ ట్రోఫీతో హ‌ల్ చ‌ల్

వ‌న్డేల్లో ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన‌ది చాంపియ‌న్స్ ట్రోఫీ. దీంట్లోనూ భార‌త జ‌ట్టు 2013 త‌ర్వాత విజేత‌గా నిల‌వ‌లేదు. 2017లో ఫైన‌ల్లో పాకిస్థాన్ చేతిలో ఓడింది. మ‌రి ఈసారైనా నెగ్గుతుందా? అనే అనుమానాలు. వేదిక దుబాయ్ కావ‌డంతో వ‌న్డే ఫార్మాట్ లో ఎంత‌వ‌ర‌కు రాణిస్తుందో అనే అభిప్రాయం. కానీ, కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ లతో అజేయంగా ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ ను మ‌ట్టిక‌రిపించింది.

ఇంగ్లండ్ లో దీటుగా నిలిచారు..

5 టెస్టుల సిరీస్ కోసం ఈఏడాది జూన్-జూలైలో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది టీమ్ ఇండియా. అదికూడా రోహిత్, కోహ్లి అనూహ్య రిటైర్మెంట్ అనంత‌రం. పైగా ఈ సిరీస్ కు కుర్రాడు శుబ్ మ‌న్ గిల్ కెప్టెన్. ప్ర‌ధాన పేస‌ర్ బుమ్రా అన్ని టెస్టులు ఆడేంత ఫిట్ నెస్ లో లేడు. కానీ, ఫ‌లితం చివ‌ర‌కు 2-2తో సిరీస్ డ్రా. గిల్ ఏకంగా 700 పైగా ప‌రుగులు సాధించాడు. హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ 23 వికెట్లు తీసి టీమ్ ఇండియాను స‌గ‌ర్వంగా నిల‌బెట్టాడు.

ఆసియా కప్ లో దుమ్మురేపారు..

ఇటీవ‌లి ఆసియా క‌ప్ లో టీమ్ ఇండియా ప్ర‌ద‌ర్శ‌న మ‌రో మెట్టు ఎక్కింది. టి20 ఫార్మాట్ లో జ‌రిగిన ఈ టోర్నీలో మ‌న జ‌ట్టు అద్భుత రీతిలో మూడుసార్లు పాకిస్థాన్ ను ఓడించింది. ఫైన‌ల్లో హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. పాక్ క్రికెట‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా, ఆ దేశానికి చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ మొహిసిన్ న‌ఖ్వీ నుంచి క‌ప్ అందుకోకుండా.. పెహ‌ల్గాం ఉగ్ర‌దాడికి టీమ్ ఇండియా మైదానంలో ప్ర‌తీకారం తీర్చుకుంది.

అమ్మాయిలు అద‌ర‌గొడుతున్నారు..

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఫైన‌ల్ కు చేరి.. దేశ ప్ర‌తిష్ఠ‌ను అమాంతం పెంచింది. 2017 త‌ర్వాత మ‌న జ‌ట్టు తుది స‌మ‌రం చేర‌డం ఇదే మొద‌టిసారి. అయితే, గ‌త రెండుసార్లు ప్ర‌త్య‌ర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్. ఇప్పుడు మాత్రం ద‌క్షిణాఫ్రికా. ఇక్క‌డే టీమ్ ఇండియా అమ్మాయిలు ప్ర‌పంచక‌ప్ కొట్టేస్తార‌నే న‌మ్మ‌కం పెరుగుతోంది. ఆదివారం ఇదే జ‌రిగితే భార‌త మ‌హిళ‌ల‌ క్రికెట్ ద‌శ తిరిగిన‌ట్లే..!

అప‌జ‌యాలూ ఉన్నాయి...

గ‌త 16 నెల‌ల్లో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ‌లూ ఉన్నాయి.. స్వ‌దేశంలో ఎన్న‌డూ లేనివిధంగా 0-3తో న్యూజిలాండ్ కు టెస్టు సిరీస్ ను కోల్పోయింది. ఆపై ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో 1-3తో సిరీస్ చేజార్చుకుంది. అయితే, ఈ రెండు దెబ్బ‌ల‌తోనే సీనియ‌ర్లు రోహిత్, కోహ్లిలకు రిటైర్మెంట్ అవ‌స‌రం ఏర్ప‌డింది.టీమ్ ఇండియా టెస్టు ప‌గ్గాలు శుబ్ మ‌న్ గిల్ చేతికి వ‌చ్చాయి. అత‌డి నాయ‌క‌త్వంలో తొలి టూర్ లోనే ఇంగ్లండ్ పై మ‌న జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. ఇదే ఊపులో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌రిగే టి20 ప్ర‌పంచ‌క‌ప్ ను కూడా కొట్టేస్తే.. సూప‌ర్.