ఆసియా కప్ లో అజేయం..భరత మాత నుదుటిన విజయ సిందూర తిలకం
టీమ్ ఇండియా అదరగొట్టింది.. నిరుడు టి20 ప్రపంచ కప్... ఈ ఏడాది ప్రారంభంలో చాంపియన్స్ ట్రోఫీ.. మళ్లీ ఇప్పుడు ఆసియా కప్...! ప్రపంచ టోర్నీల్లో భారత్ కు తిరుగులేదని మరోసారి నిరూపించింది.
By: Tupaki Entertainment Desk | 29 Sept 2025 9:31 AM ISTటీమ్ ఇండియా అదరగొట్టింది.. నిరుడు టి20 ప్రపంచ కప్... ఈ ఏడాది ప్రారంభంలో చాంపియన్స్ ట్రోఫీ.. మళ్లీ ఇప్పుడు ఆసియా కప్...! ప్రపంచ టోర్నీల్లో భారత్ కు తిరుగులేదని మరోసారి నిరూపించింది. అయితే, గత రెండు (టి20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ) టోర్నీల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మీద గెలిచింది. కానీ, ఇప్పుడు మాత్రం మరింత స్పెషల్. కారణం.. ఆసియా కప్ ఫైనల్లో నెగ్గింది పాకిస్థాన్ పై కావడం. జట్టుగా పాక్ మనకు పోటీ కాదు.. కానీ, పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన ఈ టోర్నీలో వాతావరణం వేడెక్కింది.
ఒక్కటంటే ఒక్క చాన్స్ ఇవ్వలేదు...
అసలు జరుగుతుందా? జరిగితే టీమ్ ఇండియా పాల్గొంటుందా? ఒకవేళ పాల్గొన్నా పాకిస్థాన్ తో మ్యాచ్ లు ఆడుతుందా? అనే అనుమానాల మధ్య మొదలైన ఆసియా కప్.. అంతే ఉత్కంఠగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ను టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు.. ప్రత్యర్థిని 146 పరుగులకు కట్టడి చేసింది. పాక్ ఇన్నింగ్స్ మొదలైన తీరు చూస్తే ఆ జట్టు 180 పైగా పరుగులు సాధిస్తుంది అనిపించింది. ఆ జట్టు ఓపెనర్లు సాహిబ్జాద్ ఫర్హాన్ (38 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46, 2 ఫోర్లు, 2 సిక్సులు) 9.4 ఓవర్లలో 84 పరుగులు జోడించారు. అయితే, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ బంతికి షాట్ కొట్టబోయి ఫర్హాన్ ఔటయ్యాడు. ఈ క్యాచ్ ను హైదరాబాదీ తిలక్ అందుకున్నాడు. అక్కడినుంచి పాక్ పతనం మొదలైంది. ఈ కప్ లో నాలుగు డక్ లు పెట్టిన సయీమ్ అయూబ్ (14)ను కుల్దీప్ బోల్తాకొట్టించాడు. మరొక్క పరుగు జోడించగానే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ హారిస్ (0)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఇక ఇక్కడినుంచి మొదలైన పాక్ వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. అది ఎంతగా అంటే... పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (8) సహా ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. దీంతో 113/2 నుంచి ఆ జట్టు 146 పరుగులకే చాప చుట్టేసింది.
భళా కుల్దీప్...
గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలో దిగలేదు. దీంతో టీమ్ ఇండియాకు మొదట్లోనే కొంత మైనస్ ఏర్పడింది. అతడి స్థానంలో రింకూ సింగ్ ను తీసుకున్నారు. హార్దిక్ లేకపోవడంతో.. కొత్త బంతితో బౌలింగ్ ను ఆల్ రౌండర్ శివమ్ దూబెతో మొదలుపెట్టారు. అతడు మూడు ఓవర్లలో 23 పరుగులిచ్చి తన బాధ్యత నెరవేర్చాడు. మేటి పేసర్ బుమ్రాను పాక్ ఓపెనర్లు దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ను త్వరగానే బరిలో దింపారు. పాక్ ఓపెనర్ ఫర్హాన్ ను ఔట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని మొదలుపెట్టింది వరుణే (2/30). అయితే, మ్యాచ్ లో చైనామన్ కుల్దీప్ యాదవ్ (4/30) బౌలింగే హైలైట్. అతడి బంతులకు అయూబ్, ఆఘా, ఆఫ్రిది నిలవలేకపోయారు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ (2/30) సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా (2/25) చివర్లో జూలు విదిల్చాడు.
అభిషేక్ చేయలేదు కానీ.. తిలక్ దుమ్మురేపాడు...
ఈ టోర్నీలో మొదటినుంచి దుమ్మురేపిన టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (5) ఫైనల్లో త్వరగానే ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ (12) నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్య (1) మళ్లీ విఫలమయ్యాడు. 20 పరుగులకే ఈ ముగ్గురిని కోల్పోయిన టీమ్ ఇండియా మ్యాచ్ లో చాలా కష్టాల్లో పడింది. కానీ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (21 బంతుల్లో 24, 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సులు) జట్టును విజయం దిశగా నడిపాడు. సంజూ ఔటైనా.. దూబె (22 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్స్ లు) అండగా నిలవడంతో తిలక్ లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చాడు. చివర్లో దూబె ఔటైనా.. కాబోయే పెళ్లి కొడుకు రింకూ సింగ్ (4 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టి దేశం మొత్తాన్ని ఆనందంలో నింపాడు. భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగుల చేసి ఆసియా కప్ ను 9వ సారి అందుకుంది. టి20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ మాదిరిగానే ఒక్క ఓటమి కూడా లేకుండా కప్ ను కొట్టేసింది.
-అద్బుత పోరాటంతో భరత మాత నుదుటిన విజయ తిలకం దిద్దిన హైదరాబాదీ తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అభిషేక్ 7 మ్యాచ్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 314 పరుగులు చేశాడు. ఫైనల్ మినహా అన్ని మ్యాచ్ లలో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మ (7 మ్యాచ్ లలో 314 పరుగులు)కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
