Begin typing your search above and press return to search.

టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్? ఆ జట్టుకు ఛాన్స్!

బంగ్లాదేశ్ టోర్నీకి దూరమైతే కేవలం ప్రతిష్ఠపరంగానే కాదు, ఆర్థికంగా కూడా భారీ నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

By:  A.N.Kumar   |   20 Jan 2026 9:13 AM IST
టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్? ఆ జట్టుకు ఛాన్స్!
X

మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమవుతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీపై ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టోర్నీకి ముందే ఒక కీలక వివాదం చర్చనీయాంశంగా మారింది. అదే బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చితి.

భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారతదేశానికి రావడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తమ డిమాండ్లను అంగీకరించకపోతే టోర్నీలో పాల్గొనబోమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి స్పష్టమైన సంకేతాలు పంపినట్టు సమాచారం. ఇది ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.

ఐసీసీ అల్టిమేటం

ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భారత్‌కు రావాల్సిందేనని.. లేకపోతే టోర్నీ నుంచి తప్పించాల్సి వస్తుందని బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసింది. జనవరి 21 లోపు తమ తుది నిర్ణయాన్ని తెలియజేయాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు టీమ్ ఇండియా కావడంతో భారత్ నిర్వహణలోని టోర్నీ విషయంలో రాజీపడే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది.

బంగ్లాదేశ్ ఆడకపోతే ఎవరు?

ఇప్పుడీ వివాదంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే… బంగ్లాదేశ్ టోర్నీకి దూరమైతే ఆ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని ఐసీసీ యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక క్రీడా మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది కేవలం ఊహాగానం కాదని అర్థమవుతోంది.

ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే సంచలనంగా మారనుంది. ఎందుకంటే, రెగ్యులర్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్ అయిన బంగ్లాదేశ్ క్రికెట్ టీం స్థానంలో అసోసియేట్ నేషన్ అయిన స్కాట్ లాండ్ క్రికెట్ టీంకు అవకాశం రావడం చాలా అరుదైన విషయం.

ఆర్థికంగా బంగ్లాకు దెబ్బ

బంగ్లాదేశ్ టోర్నీకి దూరమైతే కేవలం ప్రతిష్ఠపరంగానే కాదు, ఆర్థికంగా కూడా భారీ నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ జట్టు క్రికెట్ బోర్డు ఆదాయం పరిమితంగానే ఉంది. టి20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్‌ను కోల్పోతే స్పాన్సర్లు, ప్రసార హక్కుల ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం ఉంది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది.

స్కాట్లాండ్‌కు బంపర్ ఛాన్స్

మరోవైపు స్కాట్లాండ్‌కు ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్ దక్కితే ఆ జట్టు మేనేజ్మెంట్‌కు ఆర్థికంగా, అనుభవపరంగా భారీ లాభం చేకూరుతుంది. యువ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి జట్లతో పోటీపడే అవకాశం లభిస్తుంది.

తుది నిర్ణయం ఎవరిదీ?

ఇప్పుడు అంతా బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పంతాలకు పోతే టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకునే ప్రమాదం ఉంది. సమయానికి నిర్ణయం మార్చుకుంటే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం ఇంకా మిగిలే ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.