టి20 ప్రపంచకప్..బంగ్లా మ్యాచ్ వేదికల మార్పు..ట్విస్టిచ్చిన ఐసీసీ
వచ్చే నెల 7 నుంచి భారత్-శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న టి20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే వేదికలు మారనున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Entertainment Desk | 12 Jan 2026 3:15 PM ISTవచ్చే నెల 7 నుంచి భారత్-శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న టి20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే వేదికలు మారనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాకు అత్యంత దగ్గరగా ఉండే పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా, భారత్ లో కీలక నగరమైన మహారాష్ట్ర రాజధాని ముంబైలో తొలుత ఆ జట్టు ఆడాల్సి ఉంది. అయితే, భౌగోళికంగా కోల్ కతా చాలా దగ్గరగా ఉండడంతో బంగ్లాలో హిందువులపై జరుగుతున్న హింస ప్రభావం ఇక్కడా కనిపించే ప్రమాదం. ఇక శాంతిభద్రతల రీత్యా ముంబై సున్నిత నగరం. అలాంటి చోట్ల బంగ్లాదేశ్ తో ఈ పరిస్థితుల్లో మ్యాచ్ లు ఆడించడం కూడా సబబు కాదు. మరోవైపు బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో... బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పించారు. దీనిని సాకుగా తీసుకుని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ).. టి20 ప్రపంచ కప్ లో తమ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ)కి లేఖ రాసింది. కానీ, దీనిపై ఐసీసీ అనుకోని ట్విస్ట్ ఇచ్చింది.
అక్కడ కాదు ఇక్కడ ఆడండి..
టి20 ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ కోల్ కతాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. మెగా టోర్నీ ఇంకా మూడు వారాల్లో మొదలుకావాల్సి ఉందని ఐసీసీ భావిస్తోంది. అందుకని అసలు భారత్ లోనే ఆడం అంటే కుదరదని బంగ్లాకు పరోక్షంగా తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ జట్టు మ్యాచ్ లను చెన్నై, తిరువనంతపురంలో నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఈ రెండూ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ రాజధానులు. అంతేగాక, ఇతర సున్నిత పరిస్థితులు ఇక్కడ ఉండవు.
బంగ్లా బోర్డు ఏమంటుందో?
ఐసీసీ ప్రతిపాదనలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వ్యతిరేకతతోనే ఉందని తెలుస్తోంది. అయితే, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అనుమతితో ఏ నిర్ణయమైనదీ ప్రకటించాలని చూస్తోంది. ప్రభుత్వంతో చర్చించి వెల్లడిస్తామని బీసీసీ చీఫ్ అమినుల్ ఇస్లాం ఇప్పటికే ప్రకటించాడు. మొత్తానికి బంగ్లా కోరినట్లు మ్యాచ్ లను శ్రీలంకకు మార్చకుండా.. ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ట్విస్ట్ తో కూడిన షాకిచ్చింది. అక్కడ ఐసీసీ చీఫ్ గా ఉన్నది ఎవరు? భారతీయుడైన జై షా మరి..!
