బంగ్లాను ఓడించిన స్కాట్లాండ్.. ప్రపంచకప్ లోనూ.. అభిమానంలోనూ!
లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్లు ఉంటుంది స్కాట్లాండ్ ఆటతీరు. ప్రపంచ కప్ నకు 15 మంది సభ్యుల జట్టును తాజాగా ప్రకటించింది.
By: Tupaki Political Desk | 27 Jan 2026 6:00 PM ISTటి20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ స్వయంగా వైదొలగి పరువు పోగొట్టుకుంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి అర్హత సాధించడమే మంచి అవకాశం. అందులోనూ భారత్ వంటి దేశంలో మెగా టోర్నీలో ఆడడం మరొక అరుదైన చాన్స్. పైగా బంగ్లాకు పక్కనే ఉండే దేశం భారత్. ఇక్కడి పిచ్ లు ఆ జట్టుకు బాగా అలవాటైనవే. కానీ, బంగ్లాదేశ్ మనసులో విద్వేషం పెట్టుకుని టి20 ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేసింది. ఫలితంగా అనూహ్య రీతిలో స్కాట్లాండ్ కు అవకాశం దక్కింది. అయితే, ఈ జట్టు కొత్తదేమీ కాదు. ఇప్పటికే పలు ప్రపంచ కప్ లు ఆడింది కూడా. పెద్ద జట్లకు షాక్ ఇచ్చింది కూడా. బంగ్లాదేశ్ వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడు భారతీలయుందరూ స్కాట్లాండ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకూ మెగా టోర్నీలలో ఆ జట్టు ప్రదర్శన ఏమిటి? అనేది పరిశీలిస్తే ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
15 మంది సభ్యుల జట్టు..
లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్లు ఉంటుంది స్కాట్లాండ్ ఆటతీరు. ప్రపంచ కప్ నకు 15 మంది సభ్యుల జట్టును తాజాగా ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ సారథ్యంలో ఈ జట్టుకు ఇద్దరు ట్రావెలింగ్ రిజర్వ్ లనూ ఉంచింది. ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ లుగా ఎంపికచేసింది. గ్రూప్-సిలోఎ స్కాట్లాండ్.. కోల్ కతాలోనే మూడు మ్యాచ్ లు ఆడనుంది. ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 7నే తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ తో, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్ తో తలపడనుంది. 17న ముంబైలో నేపాల్ తో ఆడాల్సి ఉంది.
అప్పటివారే ఇప్పుడు
భారత్ విజేతగా నిలిచిన 2024 ప్రపంచకప్ లోనూ స్కాట్లాండ్ ఆడింది. ఆ జట్టులోని 11 మంది ప్రస్తుత జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ టి20 ర్యాంకింగ్స్ లో 14వ స్థానంలో ఉన్న బంగ్లా.. 2007 నుంచి 2009, 2016, 2021, 2022 సహా ఆరుసార్లు ప్రపంచ కప్ లకు అర్హత సాధించింది.
అప్పుడు మిస్.. ఇప్పుడు లక్
గత మూడు వరల్డ్ కప్ లకూ క్వాలిఫై అయిన స్కాట్లాండ్ ఈసారి మిస్ అయింది. అయ్యో చాన్స్ మిస్ అయిందే అనుకుంటుండగా.. బంగ్లా బాయ్ కాట్ రూపంలో అవకాశం వచ్చింది. విచిత్రం ఏమంటే.. 2021 ప్రపంచ కప్ లో ఇదే బంగ్లాదేశ్ ను స్కాట్లాండ్ ఓడించింది. 2022లో వెస్టిండీస్ ను కూడా పరాజయం పాల్జేసింది. 2024లో అయితే ఆస్ట్రేలియానే వణికించింది. 181 పరుగుల టార్గెట్ పెట్టి.. ఆసీస్ ను 19.4 ఓవర్ వరకు విజయం సాధించకుండా అడ్డుకుంది. మళ్లీ ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడాలి.
