భారత్ లో టి20 ప్రపంచకప్.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!
చూస్తుండగానే మళ్లీ టి20 ప్రపంచ కప్ వచ్చేసింది.. స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్‌శర్మ కెప్టెన్సీలో, దిగ్గజం విరాట్ కోహ్లి ప్రాతినిధ్యంలో గత ఏడాది జూన్‌లో జరిగిన మెగా టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది.
By: Tupaki Entertainment Desk | 7 Nov 2025 10:30 AM ISTచూస్తుండగానే మళ్లీ టి20 ప్రపంచ కప్ వచ్చేసింది.. స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్‌శర్మ కెప్టెన్సీలో, దిగ్గజం విరాట్ కోహ్లి ప్రాతినిధ్యంలో గత ఏడాది జూన్‌లో జరిగిన మెగా టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి కప్ తెచ్చింది. ఈ ఘన విజయంతో దిగ్గజాలు కోహ్లి, రోహిత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది రోహిత్, కోహ్లిలు టెస్టులకూ వీడ్కోలు పలికారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయ. మొత్తమ్మీద ఇది 10వ టి20 ప్రపంచ కప్. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పంపినట్లు సమాచారం. ఇందులో ఏ మ్యాచ్ లు ఎక్కడ నిర్వహించాలో పేర్కొన్నారు. ఐసీసీ ఆమోదం వచ్చాక అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
20 నెలల్లోనే.. ఈ ఐదు నగరాల్లోనే..
టి20 ప్రపంచ కప్ గతేడాది జూన్ లో ముగిసింది. మళ్లీ 20 నెలల్లోనే ఫిబ్రవరి-మార్చిలో జరగనుంది. ఇక 2016 తర్వాత భారత్ మళ్లీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణకు ప్లాన్ చేసింది. ఫైనల్ మాత్రం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అహ్మదాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతాలోనే మొత్తం మ్యాచ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. మన హైదరాబాద్ కు చాన్స్ లేనట్లేనని సమాచారం. వాస్తవానికి 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో పలు మ్యాచ్ లు జరిగాయి. వీటిలో పాకిస్థాన్ జట్టువీ ఉండడం గమనార్హం.
ఈసారి పాక్ లంకలో..
రెండేళ్ల కిందటి వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వచ్చిన పాకిస్థాన్ కు ఈ సారి టి20 ప్రపంచ కప్ నకు ఆ అవకాశం లేదు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో క్రీడా సంబంధాల విషయంలో భారత్ కఠినంగా ఉంటోంది. ఆ దేశ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడమూ లేదు. అందుకని పాకిస్థాన్ తమ మ్యాచ్ లను రెండో ఆతిథ్య దేశం శ్రీలంకలో ఆడనుంది. ఒకవేళ టీమ్ ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ కు చేరినా ఆ మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది. పాక్ ఆ దేశంలో ఆడే మ్యాచ్‌లన్నీ ఒకే నగరంలో ఉండనున్నాయి. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్‌లోనూ పాక్ జట్టు తమ మ్యాచ్ లను లంకలోనే ఆడిన సంగతి తెలిసిందే.
