టీ20లో టీమిండియాకు కొత్త తలనొప్పి?
భారత క్రికెట్ జట్టుకు ‘టీ20 ఎక్స్ ఫ్యాక్టర్’గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేని స్థితి ఇప్పుడు జట్టుకు పెద్ద సమస్యగా మారింది.
By: A.N.Kumar | 7 Nov 2025 10:41 AM ISTభారత క్రికెట్ జట్టుకు ‘టీ20 ఎక్స్ ఫ్యాక్టర్’గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేని స్థితి ఇప్పుడు జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు బౌలర్లను భయపెట్టే స్థాయిలో ఆడిన సూర్యా.. ఇప్పుడు తన పాత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. ప్రతి ఇన్నింగ్స్ ఆశతో మొదలై, నిరాశతో ముగుస్తోంది.
అంకెలే చెబుతున్నాయి వాస్తవం
ఇటీవలి ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సూర్యా 10 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ కూడా అభిమానుల నిరాశను మరింత పెంచింది. దాదాపు 392 రోజులు అయింది ఆయన ఫిఫ్టీ చేయకుండా, 542 రోజులు అయ్యింది శతకం చేయక. ఇంత ప్రతిభ కలిగిన ఆటగాడికి ఇది అసాధారణమైన ఫామ్ డ్రాప్ అని చెప్పాలి.
గత 18 ఇన్నింగ్స్‌లలో ఆయన సగటు 12 పరుగులు మాత్రమే, స్ట్రైక్ రేట్ కూడా కేవలం 106 వద్ద నిలిచింది. ఒకప్పుడు ఆయన ఆట వేగం, టైమింగ్, అగ్రెషన్ అన్నీ అభిమానులకు హుషారును కలిగించేవి. కానీ ఇప్పుడు ఆ స్పార్క్ పూర్తిగా మాయమైనట్టే ఉంది.
కెప్టెన్సీతో స్థిరత్వం ఉన్నా...
ఫామ్ తగ్గినా సూర్యకుమార్ కెప్టెన్‌గా మాత్రం స్థిరంగా వ్యవహరిస్తున్నారు. మైదానంలో ఆయన నిర్ణయాలు, క్రికెట్ సెన్స్ ఇంకా జట్టులో గౌరవాన్ని తెస్తున్నాయి. కానీ నాయకత్వం ఒక్కటే సరిపోదు. జట్టుకు గెలుపు కావాలంటే ఆయన బ్యాట్ మళ్లీ గర్జించాల్సిందే.
ఫ్యాన్స్ అసహనం పెరుగుతోంది
సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆవేశంతో స్పందిస్తున్నారు. "కెప్టెన్సీ ప్రెజర్ వల్లే ఫామ్ దెబ్బతిన్నదా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆయన షాట్ సెలక్షన్ ను, నిర్లక్ష్యమైన అప్రోచ్‌ను విమర్శిస్తున్నారు. ఒకప్పుడు టీ20లో అత్యంత నమ్మదగిన బ్యాట్స్‌మన్‌గా ఉన్న సూర్యా ఇప్పుడు ఒత్తిడిలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నారు.
* వరల్డ్ కప్‌కు ముందు కఠిన పరీక్ష
ఇప్పుడు సూర్యకుమార్‌కు ఇది అత్యంత కీలక దశ. రాబోయే టీ20 వరల్డ్‌కప్ ముందు ఆయన మళ్లీ తన పాత శైలిలోకి రావాలి. ఎందుకంటే ఆయన ఒక్క ఇన్నింగ్స్ జట్టుకు మోమెంటం మార్చే శక్తి కలిగినది.
భారత జట్టుకు ఇంకా ఆశ ఉంది. సూర్యా ఒక్క డిఫైనింగ్ నాక్‌తోనే అన్ని అనుమానాలను చెరిపేసి, తన పాత "మిస్టర్ 360" మాంత్రికతను తిరిగి తెచ్చుకోవాలని దేశం ఎదురుచూస్తోంది.
