Begin typing your search above and press return to search.

కెప్టెన్సీ పోయినా స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్ చూపించిన సూర్యకుమార్!

ఈ షాకింగ్ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

By:  Madhu Reddy   |   9 Jun 2026 4:00 PM IST
కెప్టెన్సీ పోయినా స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్ చూపించిన సూర్యకుమార్!
X

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాకిచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అద్భుతమైన ట్రోఫీ అందించినప్పటికీ, వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా అతడిని కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా జట్టు నుంచే తప్పించారు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా నియమించారు. ఈ షాకింగ్ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

మనసు గాయపడిందన్న సూర్య:

కెప్టెన్సీ, జట్టులో స్థానం కోల్పోవడంపై సూర్యకుమార్ యాదవ్ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. "నిజం చెప్పాలంటే, ఈ నిర్ణయం నన్ను కొంచెం బాధపెట్టింది. భారతదేశానికి కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను ఒక్క సిరీస్ లేదా టోర్నమెంట్‌ను కూడా ఓడిపోలేదు. ఇక అలాంటిది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఇలా జరగడం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని సూర్య తన మనసులోని బాధను బయటపెట్టారు.

అంతా మన చేతుల్లో ఉండదు:

ఒక ఆటగాడిగా జీవితంలో అన్నీ మన చేతుల్లోనే ఉండవని సూర్య అన్నారు. "సమాజంలో ఏం జరిగినా మనం అంగీకరించక తప్పదు. నా నొసట రాసి పెట్టి ఉన్నదే నాకు దక్కింది. ఈ నిర్ణయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా అనిపించినప్పటికీ, ఇప్పుడు దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. నా పూర్తి దృష్టిని మళ్లీ నా క్రికెట్ మీదే పెట్టాలనుకుంటున్నాను" అని సూర్య స్పష్టం చేశారు.

కొత్త కెప్టెన్‌కు సపోర్ట్:

తనకు అన్యాయం జరిగినా సూర్యకుమార్ యాదవ్ రియల్ స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్‌ను ప్రదర్శించారు. “రాబోయే రోజుల్లో ఆడబోయే క్రికెటర్లకు నా పూర్తి మద్దతు ఉంటుందని” తెలిపారు. ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి నా వంతు సహాయం అందిస్తాను" అని చెప్పారు. తన ముంబై సహచరుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం పట్ల కూడా సూర్య సంతోషం వ్యక్తం చేస్తూ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌ను తర్వాతి సిరీస్‌లకే పక్కన పెట్టడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన మరియు కఠినమైన నిర్ణయం. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ సూర్యకుమార్ యాదవ్ చూపించిన పరిణతి, స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి. ఇక సెలక్టర్లు భవిష్యత్తు లైనప్ కోసం ఈ మార్పులు చేసినా, సూర్య లాంటి పవర్‌ఫుల్ ప్లేయర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి టీమిండియాలోకి గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.